Homeతెలంగాణహైదరాబాద్TTE: టికెట్ తనిఖీకి మించి.. ప్రయాణికుల భద్రతకు టీటీఈల అండ

TTE: టికెట్ తనిఖీకి మించి.. ప్రయాణికుల భద్రతకు టీటీఈల అండ

  • సికింద్రాబాద్ డివిజన్‌లో అప్రమత్తత, సమయస్ఫూర్తితో పలు ఘటనల్లో ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బంది

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): రైలులో టికెట్లు తనిఖీ చేయడం మాత్రమే కాదు, ప్రయాణికుల భద్రత, సౌకర్యం, క్రమశిక్షణకు టీటీఈలు కీలకంగా పనిచేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ స్పందనదారులుగా వ్యవహరిస్తూ, ప్రమాదాలను నివారించడం, పిల్లలను రక్షించడం, ప్రయాణికుల వస్తువులను భద్రపరచడం వంటి సేవలు అందిస్తున్నారని పేర్కొంది. భారతీయ రైల్వే రోజుకు సగటున 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తుండగా, క్షేత్రస్థాయి సిబ్బంది అంకిత భావం సురక్షిత ప్రయాణానికి కీలకంగా నిలుస్తోందని తెలిపింది.

- Advertisement -

పిల్లల రక్షణలో కీలక పాత్ర..

లక్డీకాపూల్ స్టేషన్‌లో బాలలపై వేధింపులకు పాల్పడుతున్నాడని అనుమానించిన వ్యక్తిని ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ సాయి రామ్ అడ్డుకుని ఆర్‌పీఎఫ్‌కు అప్పగించారు. ఈ ఘటనపై జీఆర్‌పీ పోక్సో కేసు నమోదు చేసింది. బేగంపేట్, సికింద్రాబాద్ స్టేషన్లు, రైళ్లలో తప్పిపోయిన పలువురు పిల్లలను గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంలోనూ టీటీఈలు సహకరించారు.

సమయస్ఫూర్తితో ప్రాణ రక్షణ..

జూన్ 2న 12861 ఎక్స్‌ప్రెస్‌లో డోర్నకల్ స్టేషన్ వద్ద రైలు–ప్లాట్‌ ఫారమ్ మధ్య పడిపోయిన ప్రయాణికుడిని గమనించిన టీటీఐఎం సాయి శంకర్ అలారం చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఆర్పీఎఫ్ సహాయంతో బాధితుడిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అదే రోజు 12285 దురంతో ఎక్స్‌ప్రెస్‌లో గుండెపోటుకు గురైన ప్రయాణికుడికి టీటీఐ ఎం.వి. సుబ్బారెడ్డి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు కీలకంగా స్పందించారు. నిజాముద్దీన్ చేరుకున్న వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు.

Also Read: Mahankali Ghatam: న్యూ బోయిగూడలో మహంకాళి అమ్మవారి ఘటానికి ఘన స్వాగతం

అగ్ని ప్రమాజదాలను ముందే గుర్తించి..

మే 29న 18045 ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ ప్రెస్ లో టాయిలెట్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన టీటీఐ ఉత్తమ్ సింగ్ అలారం చైన్ లాగి రైలును నిలిపివేసి ప్రమాదాన్ని నివారించారు. జూలై 8న 12714 శాతవాహన ఎక్స్‌ప్రెస్లో స్మోక్ డిటెక్టర్ పనిచేయడాన్ని గుర్తించిన టీటీఐ బాలరాజు వెంటనే స్పందించి ధూమపాన వ్యతిరేక నిబంధనలను అమలు చేశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై నిఘా…

11020 కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్యాన్ని టీటీఐ ఎం.వి. సుబ్బారెడ్డి గుర్తించి భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. నిందితులను తదుపరి చర్యల కోసం కాజీపేటలో ఆర్‌పీఎఫ్‌కు అప్పగించారు.

నిజాయితీకి నిదర్శనం..

జూన్ 22న బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడు మరిచిపోయిన విలువైన కార్పొరేట్ ఎలక్ట్రానిక్ పరికరాలను టీటీఐ రేచెల్ రంజిత గుర్తించి భద్రపరిచా రు. ధ్రువీకరణ అనంతరం వాటిని యజమానికి సురక్షితంగా అప్పగించారు.

స్వచ్ఛత, క్రమశిక్షణపై అవగాహన..

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎంఎంటీఎస్ సర్వీసులు, ప్రధాన రైల్వే స్టేషన్లలో టికెట్ తనిఖీ సిబ్బంది పరిశుభ్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. రైళ్లలో క్రమశిక్షణ పాటించని వారిపై నిబంధనల ప్రకా రం జరిమానా, ప్రాసిక్యూషన్ వంటి చర్యలు తీసుకుంటామని భారతీయ రైల్వే తెలిపింది.

సురక్షితమైన రైలు ప్రయాణం..

రైల్వే సిబ్బంది, ప్రయాణికుల ఉమ్మడి బాధ్యత. ప్రయాణికులు టికెట్ తనిఖీ సిబ్బందికి సహక రించాలని, రైల్వే నిబంధనలు పాటించాలని, తమ సామాను భద్రపరుచుకోవడంతో పాటు రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతను కాపాడాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News