Homeతెలంగాణహైదరాబాద్HYDRAA: ఊహించని రెస్పాన్స్‌.. హైడ్రా ఉద్యోగాలకు నిరుద్యోగుల తాకిడి, టోకెన్ల పంపిణీలో తోపులాట

HYDRAA: ఊహించని రెస్పాన్స్‌.. హైడ్రా ఉద్యోగాలకు నిరుద్యోగుల తాకిడి, టోకెన్ల పంపిణీలో తోపులాట

ఎల్‌బీనగర్‌ (తెలుగుప్రభ): ‘హైడ్రా’(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో శనివారం ఉద్రిక్తతకు దారితీశాయి. 50 డ్రైవర్‌, 100 డీఆర్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌కు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత తరలివచ్చింది. 

- Advertisement -

hydraa

తెల్లవారుజాము నుంచే

ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్లు నిర్వహించనున్నట్లు హైడ్రా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అభ్యర్థులు 170 సెకన్లలో 800 మీటర్ల పరుగు, 15 సెకన్లలో 100 మీటర్లు, నాలుగు మీటర్ల లాంగ్‌జంప్‌, 6 మీటర్ల షాట్‌పుట్‌ వంటి ఈవెంట్లలో అర్హత సాధించాల్సి ఉంది. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువకులు తెల్లవారుజాము నుంచే స్టేడియం వద్ద బారులు తీరారు. సమయం గడిచేకొద్దీ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 

hydraa employees dharna

పలువురికి స్వల్ప గాయాలు

సుమారు 2,000 నుంచి 3,000 మందికి పైగా అభ్యర్థులు వచ్చినట్లు అంచనా. అభ్యర్థులను నియంత్రించేందుకు అధికారులు టోకెన్లు పంపిణీ చేయడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ముందుకు వెళ్లేందుకు యువకులు ఒకరినొకరు నెట్టుకోవడంతో పలువురు కిందపడిపోయారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

ఊహించని స్పందన

అభ్యర్థుల సంఖ్యను నిర్వాహకులు ముందుగా సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులకు అనుగుణంగా టోకెన్లు, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు ముందుగానే చేపట్టాల్సిందని వారు పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News