Homeతెలంగాణహైదరాబాద్Charminar: సర్పాలపై అపోహలు వీడాలి.. జీవవైవిధ్య పరిరక్షణలో వాటి పాత్ర కీలకం

Charminar: సర్పాలపై అపోహలు వీడాలి.. జీవవైవిధ్య పరిరక్షణలో వాటి పాత్ర కీలకం

  • సర్పాలపై అపోహలు వీడాలి.. జీవవైవిధ్య పరిరక్షణలో వాటి పాత్ర కీలకం
  • సర్పాలపై ప్రత్యక్ష ప్రదర్శన.. క్లౌడ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌
  • జూలో ఘనంగా కొనసాగుతున్న 72వ వన్యప్రాణి వారోత్సవాలు

చార్మినార్(తెలుగు ప్రభ): నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో నిర్వహిస్తున్న 72వ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సర్పాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జూ రిప్టైల్ హౌస్‌లోని యాంఫిథియేటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో పాటు క్లౌడ్ ఫోటోగ్రఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. సుమారు 5వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దీపక్ తరుణ్ ప్రత్యక్షంగా సర్పాల ప్రదర్శన నిర్వహించి, జీవవైవిధ్యంలో సర్పాల ప్రాధాన్యత, వాటికి సంబంధించిన వాస్తవాలు, అపోహలను వివరించారు. విషపూరిత, విషరహిత సర్పాలను ఎలా గుర్తించాలి? వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే అంశాలపై సందర్శకులకు అవగాహన కల్పించారు.

- Advertisement -

ప్రకృతిలో ఎక్కువ శాతం సర్పాలు విషరహితమైనవేనని, అవి రైతులకు మిత్రులుగా వ్యవహరిస్తాయని అధికారులు తెలిపారు. ఎలుకలు, బల్లులు, కప్పలు, కీటకాలు, చిన్న క్షీరదాలను ఆహారంగా తీసుకునే రాట్ స్నేక్, శాండ్ బోవా, గ్రీన్ వైన్ స్నేక్ వంటి సర్పాలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. కింగ్ కోబ్రా, స్పెక్టకిల్డ్ కోబ్రా, వైపర్లు, క్రైట్లు తదితర పాములు విషపూరిత సర్పాలుగా వివరించారు. ఈ సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ జె. వసంత మాట్లాడుతూ.. ప్రకృతిలోని ప్రతి జీవి జీవవైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సర్పాలపై ఉన్న అపోహలు, మూఢనమ్మకాల కారణంగానే వాటిని చంపే ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సర్పాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సర్పాల కాటు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విషపూరిత–విషరహిత సర్పాలను గుర్తించే విధానాలను కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సందర్శకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సర్పాలపై ఉన్న అనేక అపోహలను తొలగించగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్-3 బి. లక్ష్మణ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె. వెంకటరావు, పీఆర్‌ఓ హెచ్.ఎం. హనీఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News