హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగు ప్రభ): పరిపాలనలో మహిళలకు భాగస్వామ్యం కల్పించకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని మహిళా రిజర్వేషన్ సంయుక్త కార్యచరణ కమిటీ (జేఏసీ) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ట్యాంక్‌బండ్ వద్ద ఐద్వా, పీఓడబ్ల్యూ1, సీఎంఎస్, పీఓడబ్ల్యూ 2 ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ1 రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప, పీఓడబ్ల్యూ2 రాష్ట్ర నాయకురాలు భారతి కలిసి మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళల రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే మహిళల సమస్యలు సమర్ధవంతంగా చర్చకు వస్తాయని అన్నారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఉపాధి, భద్రత, సామాజిక సంక్షేమం వంటి మహిళలకు సంబంధించిన అనేక కీలక అంశాలు శాసనసభల్లో ప్రస్తావించబడతాయని తెలిపారు. దేశ జనాభాలో మహిళలు దాదాపు 50 శాతం ఉన్నప్పటికీ పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం 14 శాతం మాత్రమేనని, రాష్ట్ర అసెంబ్లీలలో అయితే అది 9 శాతం వరకు పరిమితమైందని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన అసమానత అని ఆవేదన వ్యక్తం చేశారు. అదే స్థానిక సంస్థల్లో మహిళళకు 58.8 శాతం వరకు ప్రాతినిధ్యం లభిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉందని వారు తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళల 50 శాతం రిజర్వేషన్లు విజయవంతంగా అమలవుతున్నందున, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో కూడా మహిళ రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతుల కేఎస్ ఆశలత, పి.ప్రభావతి, పి. శశికళ, ఎం. వినోద, వై.వరలక్ష్మి, పి. వరలక్ష్మి, సరోజ, కె. అనురాధ, ఎండీ షబానా బేగం తదితరులు పాల్గొన్నారు.
Also Read: Encroachment : పార్కు ఆక్రమణలపై కొరడా ఝళిపించనున్న ‘హైడ్రా’: ఎల్‌బీనగర్‌లో కలకలం!

