GHMC Traffic New IPS Officers: గ్రేటర్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా యువ ఐపీఎస్ అధికారులను కీలక స్థానాల్లో నియమించింది.
నగర పాలనను మెరుగుపరిచే దిశగా కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపడుతోందని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు దీర్ఘకాలిక పరిష్కారాలను తీసుకువస్తుందని.. ఇందులో భాగంగానే యువ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయని ఆదివారం తెలిపారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/bhatti-vikramarka-slams-media-report-naini-coal-block/
భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలు లక్ష్యంగా అనుభవం ఉన్న యువ, డైనమిక్ ఐపీఎస్ అధికారులకు కీలకమైన ట్రాఫిక్ బాధ్యతలను సర్కార్ అప్పగించిందని డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు. ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లతో పాటు కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ బదిలీలు చేపట్టినట్లు డీజీపీ పేర్కొన్నారు. జిల్లాల్లో అదనపు పోలీసు సూపరింటెండెంట్లుగా సమర్థవంతంగా పనిచేసిన అధికారులను పట్టణ కమిషనరేట్లలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)గా నియమించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా గతంలో కొత్తగూడెం(ఆపరేషన్స్) అదనపు ఎస్పీగా ఉన్న అవినాష్ కుమార్‌ను హైదరాబాద్ (ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు) ట్రాఫిక్-I DCPగా నియమించినట్లు తెలిపారు. గతంలో ఉట్నూర్ అదనపు ఎస్పీగా ఉన్న కాజల్‌ను హైదరాబాద్ (గోల్కొండ, జూబ్లీ హిల్స్ జోన్లు) ట్రాఫిక్-II DCPగా నియమించామన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-government-key-decision/
జగిత్యాల అదనపు ఎస్పీగా ఉన్న ఎస్. శేషాద్రిని రెడ్డిని సైబరాబాద్ (కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు) ట్రాఫిక్-I DCPగా, జి. చందన దీప్తి (డీఐజీ, రైల్వే), ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మినిస్ట్రేషన్ & ట్రాఫిక్)గా నియమించినట్లు వివరించారు. ఇదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు జోన్లకు యువ ఐపీఎస్ అధికారులను నియమించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, సహజ వనరులను రక్షించడం, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడటం వంటి బాధ్యతలతో అభిషేక్ మొహంతిని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌గా నియమించారు.

