గండిపేట్ (తెలుగు ప్రభ): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ ఆదేశించారు. మంగళవారం నార్సింగి సర్కిల్ పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులను పరిశీలించారు.
చిత్రపురి కాలనీలోని మోడల్ రోడ్డును పరిశీలించిన కమిషనర్.. రహదారి ప్యాచ్‌వర్క్, రీకార్పెటింగ్, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచవటి కాలనీలో ప్రతిపాదిత ఫ్రీలెఫ్ట్ రోడ్డు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రధాన రహదారి దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి పనులకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా మణికొండ, నెక్నాంపూర్ ప్రాంతాల్లో తరచూ తలెత్తుతున్న నీటిముంపు సమస్యపై కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వరదనీటి ప్రవాహానికి శాశ్వత పరిష్కారం చూపేలా వినూత్న విధానాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో నీటిముంపు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం కార్యాలయ స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అమిత్ నారాయణ పేర్కొన్నారు. రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో నార్సింగి డీసీ లక్ష్మారెడ్డి, ఈఈ, యూబీడీ డీఎస్‌ఓతో పాటు ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

