HomeతెలంగాణIndiramma : గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం: ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్..

Indiramma : గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం: ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్..

హైదరాబాద్‌ (తెలుగుప్రభ): ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సిమెంట్‌ పరిశ్రమలు భాగస్వాములు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్‌ను బస్తా రూ.230కే అందించేందుకు సిమెంట్‌ పరిశ్రమల యాజమాన్యాలు అంగీకరించాయని తెలిపారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిమెంట్‌ ధరల తగ్గింపుపై పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం కాదని, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని పేర్కొన్నారు.

- Advertisement -

 

హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వీటిలో 85 శాతం ఇళ్లకు ఇప్పటికే శ్లాబులు పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. అలాగే సీయూఆర్‌ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని మంత్రి అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడినా పేదల ఇళ్ల నిర్మాణంలో రాజీ పడకుండా, నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి లబ్ధిదారుడికి విడతల వారీగా ప్రతి సోమవారం పారదర్శకంగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.


గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం : ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో నివసించే వరకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో బాధ్యత నిర్వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. పేదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందిస్తే ప్రభుత్వం, పరిశ్రమల యాజమాన్యాలను ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కో సిమెంట్‌ బస్తాను రూ.230కే అందించేందుకు పరిశ్రమల యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో హౌసింగ్‌ సెక్రటరీ వి.పి.గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News