- ప్రభుత్వాలు మారినా మారని బిల్డింగ్ అనుమతుల విధానం కోరిన రియల్ ఎస్టేట్ రంగం
- పార్కులు, వ్యర్థాల నిర్వహణ, అక్రమ ఫ్లెక్సీల తొలగింపుపై కీలక సూచనలు
- సమగ్ర నగర పాలనకు క్యూర్ చట్టం కీలక మలుపు
- క్యూర్ చట్టంపై వేగంగా ప్రజాభిప్రాయ సేకరణ
- రియల్ ఎస్టేట్, పరిశ్రమల సంఘాలతో ప్రభుత్వం కీలక సమావేశం
- సమగ్ర నగర పాలన. ప్రజా సూచనలతో క్యూర్ బిల్లుకు తుది మెరుగులు
- మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్
హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగు ప్రభ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘క్యూర్‘ ( సమగ్ర పట్టణ సంస్కరణ మరియు సాధికారత) చట్టం రూపకల్పన తుది దశకు చేరుకుంది. బిల్లును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఆధ్వర్యంలో బుధవారం నాడు రియల్ ఎస్టేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలు, ఇతర భాగస్వాములతో విస్తృత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్యూర్ చట్టం లక్ష్యాలు, సమగ్ర నగర పాలన, మెరుగైన పౌర సేవలు, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్, మహిళలకు ప్రాధాన్యం, పౌర కేంద్రిత పరిపాలన వంటి అంశాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరించారు.
Also read: Yoga : విశ్వ యోగా వేదికపై వెలిగిన రాజేంద్రనగర్ రత్నం.. రజత వీరుడు సతీష్‌కు ప్రకాశ్ గౌడ్ ఘన సత్కారం!
స్థిరమైన బిల్డింగ్ అనుమతుల వ్యవస్థ కావాలి..
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ముఖ్యంగా ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పారదర్శక బిల్డింగ్ అనుమతుల విధానంలో మార్పులు రావడం వల్ల పెట్టుబడిదారులు, నిర్మాణ రంగం అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేవలం నిర్మాణ అనుమతులకే కాకుండా నగర నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై కూడా ప్రతినిధులు విలువైన సూచనలు చేశారు. పార్కుల నిర్వహణను మెరుగుపరచడం. ఎస్‌టీపీల నుంచి వెలువడే ద్రవ వ్యర్థాల సేకరణకు గుర్తింపు పొందిన ఏజెన్సీలను నియమించడం. చనిపోయిన జంతువులను వెంటనే తొలగించే వ్యవస్థ ఏర్పాటు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోతున్న చెత్తను క్రమం తప్పకుండా తొలగించడం. ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోళ్లకు అనువైన ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడం. రోడ్లు, విద్యుత్ స్తంభాలపై అక్రమంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను కఠినంగా తొలగించడం లాంటివి చేపట్టాలని సూచించారు. అయితే, సమావేశంలో వచ్చిన ప్రతి సూచనను సమగ్రంగా పరిశీలించి, అవసరమైతే క్యూర్ బిల్లులో పొందుపరుస్తామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ హామీ ఇచ్చారు.


