Jubilee Hills Area Not in The Part of Jubilee Hills Constituency: ఇప్పడు తెలంగాణ రాజకీయం జూబ్లీహిల్స్ చుట్టూనే తిరుగుతంది. అన్ని ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఫోకస్ చేశాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తూ మాటల తూటాలు పేలుస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంటగా.. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. అటు, గ్రేటర్‌లో పట్టు నిలుపుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ త్రిముఖ పోరులో ఎవరిని విజయం వరించనుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అయితే, ఇతర నియోకవర్గాలతో పోలిస్తే జూబ్లీహిల్స్ చాలా విలక్షణమైన నియోజకవర్గం. అత్యంత సంపన్నులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివసించే ఈ ప్రాంతంలో ఇరుకైన బస్తీల్లో నివసించే పేదలను కూడా చూస్తుంటాం. అయితే, జూబ్లీహిల్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం పేరుతో ఉన్న పట్టణం దాని పరిధిలోనే ఉంటుంది. కానీ, జూబ్లీహిల్స్ ఏరియా మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండదనే వాస్తవం వింటే ఆశ్చర్యం కలుగక మానదు. వాస్తవానికి ఈ నియోజకవర్గం పరిధిలో షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ అనే ఏడు డివిజన్లలోని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో నివసించే సెలబ్రెటీల ఓట్లు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. దీంతో పేరులో ఉన్నంత వైభవం ఈ నియోజకవర్గంలో కనిపించదు. ఇక్కడ వీఐపీలు ఎవరూ ఉండరు.. ఉన్నవారంతా సాధారణ, మధ్యతరగతి ప్రజలే.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-road-show-in-jubileehilss-divisions/
సంపన్న ఏరియాగా పేరు.. ఉండేదంతా బస్తీ వాసులు..
దాదాపు, 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో బస్తీలు, ఇరుకైన గల్లీలే అధికంగా ఉన్నాయి. విద్యావంతులు ఉన్నప్పటికీ వారంతా సామాన్య జీవితం గడిపేవారే. ఇక, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ శాతం ఇతర నియోజకవర్గాలకు చెందిన వారే. అందుకే, స్థానికుడినైన తనకే పట్టం కట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన స్థానిక అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నారు. మరోవైపు, పరిపాలనా సౌలభ్యం విషయంలో కూడా ఈ నియోజకవర్గం వెనుకబడే ఉంది. ఇటీవల కొత్తగా మధురానగర్, బోరబండ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ, నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు పంజాగుట్ట, బంజారాహిల్స్, సనత్‌నగర్, ఫిలింనగర్ వంటి ఇతర నియోజకవర్గాల పరిధిలోని పోలీస్ స్టేషన్లపైనే ఆధారపడి ఉన్నాయి. రెవెన్యూ సేవల కోసం కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఖైరతాబాద్, షేక్‌పేట, అమీర్‌పేట మండల కార్యాలయాలకు వెళ్లక తప్పడం లేదు. పేరులో జూబ్లీహిల్స్ ఉన్నంత గొప్ప.. నియోజకవర్గ ప్రజల్లో లేదని, ఈ నియోజకవర్గం వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయనేది వాస్తవం. ఏదేమైనా బస్తీ వాసులు, సామాన్యుల సమస్యలే ఇక్కడ ప్రధాన ఎన్నికల అంశాలుగా మారనున్నాయి.

