Jubilee Hills Traffic Diversions:హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన ప్రవేశ ద్వారం మరియు ముగ్ధ జంక్షన్ ప్రాంతాల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణంలో భాగంగా ఫిబ్రవరి 27 నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 2లో పిల్లర్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ పనుల కారణంగా ముగ్ధ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వరకు, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దాకా వాహనాల రాకపోకల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు..
నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో రద్దీ అధికమయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
ఎన్ ఎఫ్ సి ఎల్ వైపు నుంచి…
ఎన్ ఎఫ్ సి ఎల్ వైపు నుంచి శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, సాగర్ సొసైటీ ముగ్ధ, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం 36, 45, కేబుల్ బ్రిడ్జ్ దిశగా వెళ్లే వాహనాలు శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ లేదా సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోవచ్చు. అక్కడి నుంచి శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెం 5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మార్గంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకునేలా మార్గం సూచించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం 36, 45 ప్రాంతాల నుంచి ఎన్ ఎఫ్ సి ఎల్ వైపు వెళ్లే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెం 2, యూసుఫ్ గూడ బస్తీ, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్ పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ దిశగా వెళ్లవచ్చని సూచించారు.
కేసీపీ, బంజారాహిల్స్ రోడ్ నెం 1 నుంచి కేబీఆర్ పార్క్ లేదా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు ప్రయాణించే వాహనాలు బంజారాహిల్స్ రోడ్ నెం 10 మీదుగా ప్రయాణించి క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమవైపు మలుపు తీసుకుని అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 వైపు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.
మాసబ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్ లేదా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చే వాహనాలు విరించి హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మార్గం ద్వారా జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 వైపు వెళ్లేలా మార్గం మార్చుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే …
ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్గాల్లో ప్రయాణాన్ని తగ్గించుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర అవసరం లేకపోతే ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం మంచిదని తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, రోడ్లపై ఏర్పాటు చేసే సైన్ బోర్డులను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. తాజా ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్స్ ఉపయోగించుకోవాలని సూచించారు.
Also Read:https://teluguprabha.net/telangana/telangana-plans-scooters-and-scholarships-for-inter-students/
రద్దీని తగ్గించడానికి ప్రజారవాణా సేవలను వినియోగించడం లేదా కార్ పూలింగ్ విధానాన్ని అనుసరించడం ద్వారా సహకరించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించకుండా ఉండాలని స్పష్టం చేశారు.
పిల్లర్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఈ మళ్లింపులు కొనసాగనున్నాయి. నగరంలోని ముఖ్య కూడళ్లలో పనులు జరుగుతున్న నేపథ్యంలో పౌరులు సహకరించి, సూచించిన మార్గాలను అనుసరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించవచ్చని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

