Kalvakuntla Kavitha Fire on Revanth Government: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, నిత్యం మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం, మల్కాజిగిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఆమెను కలిచివేసిందన్నారు. సాక్ష్యాత్తూ జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజా రక్షణను గాలికొదిలేసి, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేరాల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
Also read: TMC: మమతా బెనర్జీకి మరో షాక్.. టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా!
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు..
హైదరాబాద్ మహా నగరంలోని మల్కాజిగిరిలో భార్యను తుపాకీతో భర్త కాల్చి చంపడం అత్యంత దారుణమన్నారు. మూడు నెలల క్రితమే సదరు వ్యక్తి బహిరంగంగా తుపాకీతో బెదిరింపులకు పాల్పడినప్పుడే అరెస్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు నిండు ప్రాణం బలైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి, రేవంత్ రెడ్డి పాలనపై పట్టు కోల్పోయారని చెప్పడానికి ఈ ఘటన సాక్ష్యంగా కనబడుతోందన్నారు. భార్యను హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ ఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని కవిత డిమాండ్ చేశారు.

