HomeTop Storieskavitha: అక్కడ విజయ్‌.. ఇక్కడ నేను.. నెక్ట్స్ సీఎం తానేనంటూ కవిత సెన్సేషనల్‌ కామెంట్స్..!

kavitha: అక్కడ విజయ్‌.. ఇక్కడ నేను.. నెక్ట్స్ సీఎం తానేనంటూ కవిత సెన్సేషనల్‌ కామెంట్స్..!

Kalvakuntla Kavitha sensational comments: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాతే, ప్రజల కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలనే బలమైన సంకల్పంతో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినట్లు చెప్పారు. తాను టైమ్ పాస్ చేయడానికి పార్టీ పెట్టలేదని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గుణాత్మక మార్పు తేవడమే లక్ష్యంగా పార్టీ స్థాపించినట్లు స్పష్టం చేశారు. తమిళనాడులో విజయ్ లాగే తాను కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి అంటూనే.. ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సమస్య ఉందని విమర్శించారు. రాజకీయం తన తండ్రి దగ్గరే నేర్చుకున్నానని, అందుకే ఆయన్ను కూడా వ్యతిరేకించగలిగే ధైర్యం తనకు ఉందని స్పష్టం చేశారు. సుష్మా స్వరాజ్, జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ వంటి వారు తనకు స్ఫూర్తి అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, ప్రస్తుత పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు.

- Advertisement -

Also read: https://teluguprabha.net/national-news/southwest-monsoon-to-hit-kerala/

రేవంత్ రెడ్డి ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం..

ఈ సందర్భంగా కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యల చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎంగా పేర్కొన్నారు. గతంలో ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసే ఉన్నారని, అందుకే బండి సంజయ్‌ కుమారుడిపై నమోదైన కేసు విషయంపై రేవంత్ ఏమీ మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాలతో ప్రజల్లోకి వెళ్లి రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమోదైన లిక్కర్ కేసు కేవలం బీజేపీ కుట్రలో భాగమని కవిత కొట్టిపారేశారు. కేజ్రీవాల్ వంటి నీతిపరుడిని అవినీతిపరుడిగా, కేసీఆర్ కూతురిని కల్చర్ లేని వ్యక్తిగా చిత్రీకరించడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. చివరికి నిజమే గెలుస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News