Homeతెలంగాణకరెంటు కోతలు.. భానుడి భగభగలు..!

కరెంటు కోతలు.. భానుడి భగభగలు..!

  • తాగునీటికి తిప్పలు.. ఎండిపోతున్న బోరుబావులు
  • విద్యుత్‌ కోసం రోడ్డెక్కిన రైతులు.. రబీ సాగుపై అన్నదాతల్లో ఆందోళన

కామారెడ్డి టౌన్, అక్టోబర్ 9 (తెలుగు ప్రభ): ఓవైపు భానుడి భగభగలు.. మరోవైపు విద్యుత్‌ కోతలు.. ఇంకోవైపు భూగర్భజలాల తగ్గుదల.. ఇలా కామారెడ్డి జిల్లా ప్రజలను సమస్యలు చుట్టుముడుతున్నాయి. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ సరఫరా కావడం లేదంటూ రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయని, బోరుబావుల్లో నీరు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిచ్కుంద నుంచి మాచారెడ్డి మండలం వరకు విద్యుత్‌ సమస్యలపై రైతుల ఆందోళనలు చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు, రబీ సాగు సమీపిస్తుండటంతో నీరు, విద్యుత్‌ లభ్యతపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

- Advertisement -

విద్యుత్‌ కోసం రోడ్డెక్కిన రైతులు

వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ సక్రమంగా అందడం లేదంటూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు నిరసన బాట పట్టారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాల వల్ల పంటలకు నీరందించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రాస్తారోకోలు, సబ్‌స్టేషన్ల ముట్టడులకు దిగుతున్నారు. బిచ్కుంద మండలంలోని శాంతాపూర్‌ గేటు వద్ద అక్టోబర్‌ 3న రైతులు 161వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. శాంతాపూర్‌, సీతారాంపల్లి, రాజాపూర్‌, మాన్యాపూర్‌ తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరా సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. శాంతాపూర్‌ సబ్‌స్టేషన్‌ వద్ద కూడా నిరసన తెలిపారు.

అంతకుముందు సెప్టెంబర్‌ 10న మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి చౌరస్తా వద్ద రైతులు కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పాల్వంచ, చుక్కాపూర్‌, వాడి, ఫరీద్‌పేట్‌, మంతన్‌ దేవునిపల్లి గ్రామాలకు చెందిన రైతులు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను నిరసిస్తూ రోడ్డెక్కారు. విద్యుత్‌ సక్రమంగా అందక పంటలకు నీరందించడం కష్టమవుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్‌ 7న బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ ఎదుట కూడా రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్‌ కోతలతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పంటలు ఎండిపోతున్నాయనే ఆవేదన

వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టిన రైతులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు అదనపు భారంగా మారుతున్నాయి. బోరుబావుల్లో నీరు ఉన్నప్పటికీ విద్యుత్‌ అందుబాటులో లేని సమయంలో పంటలకు నీరందించడం సాధ్యం కావడం లేదు. మరోవైపు, భూగర్భజలాలు తగ్గిపోతే బోర్లు ఉన్నా ప్రయోజనం ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల ఎదుగుదలకు కీలకమైన సమయంలో నీరు అందకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు విద్యుత్‌ సమస్యలు మరింత భారంగా మారుతున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళన వారిని వెంటాడుతోంది.

తాగునీటి సమస్యలపైనా ఆందోళన

వేసవి తీవ్రత పెరిగే సమయంలో భూగర్భజలాల లభ్యత తగ్గితే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బోరుబావులపై ఆధారపడే గ్రామాల్లో నీటిమట్టాలు తగ్గిపోతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి లభ్యత తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ముందుగానే అంచనా వేయాలి. తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ప్రణాళిక సిద్ధం చేయాలి. అదే సమయంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలు, చెరువుల సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

రబీ సాగు ఎలా సాగేది?

రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో నీరు, విద్యుత్‌ సమస్యలు వారిని కలవరపెడుతున్నాయి. ఏ పంట వేయాలి? ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి? బోరుబావుల్లో నీరు సరిపోతుందా? విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉంటుందా? అనే ప్రశ్నలు అన్నదాతలను వేధిస్తున్నాయి. నీటి లభ్యతను అంచనా వేయకుండా అధిక పెట్టుబడులతో పంటలు సాగు చేస్తే నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా నీటి వనరుల పరిస్థితిని సమీక్షించి రైతులకు తగిన సూచనలు అందించాలి. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించాలి.

అధికారులు స్పందించాల్సిన సమయం

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, తాగునీటి అవసరాలు, భూగర్భజలాల తగ్గుదల వంటి సమస్యలను విడివిడిగా కాకుండా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. విద్యుత్‌ శాఖ అధికారులు వ్యవసాయానికి నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలి. సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. తాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు ముందస్తు కార్యాచరణ రూపొందించాలి. సమస్యల పరిష్కారం కోసం రైతులు రహదారులపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సమస్యలను గుర్తించి రైతులతో సమావేశాలు నిర్వహించాలి. వారి ఇబ్బందులను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. హామీలకే పరిమితం కాకుండా చేపట్టిన చర్యల అమలును పర్యవేక్షించాలి.

విద్యుత్‌ కోతలతో రైతుల ఆందోళనలు, భూగర్భజలాల తగ్గుదలతో నీటి కష్టాల భయం.. వెరసి ముందున్న రబీ సాగుపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కామారెడ్డి జిల్లా ప్రజలకు, రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. సకాలంలో చర్యలు తీసుకుంటేనే సాగుకు భరోసా, ప్రజలకు నీటి భద్రత సాధ్యమవుతాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News