Kondagattu: కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకల వేళ పెను ప్రమాదం తప్పింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో కేశఖండనశాల వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది భక్తులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తృటిలో తప్పిన ప్రాణనష్టం: ప్రమాద సమయంలో ఆ ప్రాంతం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఉంది. దీంతో భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పందిరి కింద ఉన్న భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి భక్తులు మరియు ఆలయ సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also read- Chicken: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చికెన్ దుకాణాల బంద్!
అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం: వేసవి తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాటు చేసిన ఈ చలువ పందిళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే ఈ అనర్థం జరిగిందని భక్తులు మండిపడుతున్నారు. పందిరి భారాన్ని తట్టుకోలేక కూలిపోవడమే దీనికి నిదర్శనమని వారు తెలిపారు. లక్షలాది మంది తరలివచ్చే ఉత్సవాల సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

