Homeతెలంగాణకరీంనగర్Independence : ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు: విద్యా వ్యవస్థ ప్రక్షాళనే ధ్యేయమన్న ఎంపీ వంశీకృష్ణ

Independence : ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు: విద్యా వ్యవస్థ ప్రక్షాళనే ధ్యేయమన్న ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి ( తెలుగు ప్రభ): పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ఉత్సాహంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి వారిలో స్ఫూర్తి నింపారు. అయితే, ఈ వేడుకల సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కేవలం లాంఛనప్రాయంగా ముగియకుండా, దేశ అత్యున్నత విద్యా ప్రమాణాలు మరియు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించేలా సాగింది.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర విమర్శలు : ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి విద్యా వ్యవస్థను కేంద్రం పూర్తిగా భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ముఖ్యంగా నీట్ (NEET) పేపర్ లీకేజీ ఉదంతం లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ హక్కుల కోసం, భవిష్యత్తు కోసం శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వారిపై లాఠీచార్జ్ చేయించడం, గన్ ఎక్కుపెట్టడం అప్రజాస్వామికమని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తూ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యను అణచివేసేలా కొత్త చట్టాలను తీసుకొస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో సేవా దృక్పథం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు మరియు ఆయన అందించిన స్ఫూర్తితోనే తాను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. విద్యార్థులు ఎక్కడా వెనకడుగు వేయకుండా తమ హక్కుల సాధన కోసం చేసే ప్రతి పోరాటంలో తాను ముందుంటానని, వారి వెన్నంటి నిలుస్తానని భరోసా కల్పించారు. దేశంలో కేవలం డిగ్రీలు ఇస్తే సరిపోదని, విద్యా వ్యవస్థలో సమూలమైన, గుణాత్మకమైన మార్పులు వస్తేనే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News