Congress Meeting: హైదరాబాద్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఓటరు జాబితా సవరణ (SIR)పై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో డీసీసీ అధ్యక్షులు తక్షణమే మండలాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా రైతులకు వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, రైతులకు అండగా ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి నిలబడి.. క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ నిర్దేశించిన విధంగా 3 సంవత్సరాల నిబంధనలను, అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చర్చించారు.
ఐసీసీ, పీసీసీ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్: మంత్రి కార్యాలయంలో భేటీ ముగిసిన అనంతరం.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌లతో కరీంనగర్ పార్లమెంట్ ముఖ్య నేతలు జూమ్ (Zoom) ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ (SIR) ఓటరు జాబితా సవరణపై ఏఐసీసీ, పీసీసీ నేతలు స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో తక్షణమే బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) నియామకాన్ని పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గాల వారీగా నియమించిన బిఎల్ఏల పేర్ల జాబితాను ఆయా జిల్లాల డీసీసీల ద్వారా స్థానిక జిల్లా కలెక్టర్లకు చేరవేయాలి. ప్రతి నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసి.. పూర్తిస్థాయి మండల కమిటీలను ఏర్పాటు చేయాలి. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నియోజకవర్గ ఇంచార్జీలు, కోఆర్డినేటర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Also read-High Court: బండి భగీరథ్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో దక్కని ఊరట!
సమావేశంలో పాల్గొన్న పార్టీ ముఖ్య నేతలు: ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలతో పాటు పలువురు ముఖ్య నేతలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. వీరితో పాటుగా సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కేకే మహేందర్ రెడ్డి, ఒడితల ప్రణవ్, నియోజకవర్గ కోఆర్డినేటర్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డుధం వెంకట రమణ, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, ఆదేం రాజ్ దేఖపతి, సౌజన్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

