వ్యక్తిగత విమర్శలు మాని వాస్తవాలు తెలుసుకో…
మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మంథని,(తెలుగు ప్రభ):మంథని అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే కళ్లున్నా కబోదివేనని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ప్రశ్నించారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.మంథనిలోని కూరగాయల మార్కెట్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పదేళ్లు అధికారంలో ఉండి మంథనిని అన్ని విధాలా వెనుకబడేలా చేసిన ఘనత పుట్ట మధుదేనని విమర్శించారు. కమిషన్లు,ఇసుక దందాలు,అక్రమ వసూళ్లతో ప్రజలను పీడించారని,ప్రజలు అందుకే ఓటుతో బుద్ధి చెప్పారన్నారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంథని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, తాగునీరు, సాగునీటి రంగాల్లో కోట్లాది రూపాయలతో పనులు జరుగుతున్నాయని వివరించారు. అభివృద్ధిని చూడలేక ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీనిబాబు లను ఏకవచనంతో దూషిస్తూ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ పరిణతి లేకపోవడమేనన్నారు. విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే మున్సిపాలిటీలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని, అధికారంలో ఉన్నప్పుడు భార్యను చైర్మన్ చేసి అధికారం అనుభవించిన పుట్ట మధు, ఓటమి భయంతో ఇప్పుడు భార్యను పోటీలో నిలపలేదని ఎద్దేవా చేశారు.
రాజకీయ ఉనికి కోసం తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, సూరయ్యపల్లి సర్పంచ్ ఆర్ల నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

