Homeతెలంగాణకరీంనగర్Medicover Hospital: మెడికవర్‌ హాస్పిటల్‌లో అరుదైన మైక్రోస్కోపిక్ న్యూరో సర్జరీ

Medicover Hospital: మెడికవర్‌ హాస్పిటల్‌లో అరుదైన మైక్రోస్కోపిక్ న్యూరో సర్జరీ

  • ప్రాణాపాయ స్థితిలో వచ్చిన మహిళకు విజయవంతంగా చికిత్స

కరీంనగర్ టౌన్ (తెలుగు ప్రభ): మెదడులో రక్తస్రావంతో పాటు అన్యురిజం కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన 60 ఏళ్ల మహిళకు కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన మైక్రోస్కోపిక్ న్యూరో సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తన పనులను తానే చేసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లికి చెందిన 60 ఏళ్ల కూరగాయల వ్యాపారి కౌసల్య రోజువారీ పనుల్లో భాగంగా ఉదయం లేచి పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం వెంటనే కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. స్పృహ కోల్పోయిన స్థితిలో మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న కౌసల్యకు వైద్యులు అత్యవసరంగా సీటీ స్కాన్ నిర్వహించగా మెదడులో రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో మెదడులోని రక్తనాళంలో అన్యురిజం ఉన్నట్లు నిర్ధారించారు. రక్తనాళం గోడ బలహీనపడటంతో ఒక ప్రాంతంలో బెలూన్ లా ఉబ్బిపోయే పరిస్థితినే అన్యురిజం అంటారని, అది చిట్లినప్పుడు మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు వివరించారు. కౌసల్యకు అన్యురిజం రప్చర్ అయ్యే పరిస్థితిలో అత్యంత క్లిష్టంగా మారిందని, ఆలస్యం జరిగితే ప్రాణాలకు ముప్పుతో పాటు తీవ్రమైన న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో ఎమర్జెన్సీగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కుటుంబ సభ్యులకు పరిస్థితి, శస్త్రచికిత్సలో ఉన్న హై రిస్క్ గురించి వివరించి వారి సమ్మతితో అత్యంత క్లిష్టమైన మైక్రోస్కోపిక్ న్యూరో సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్య బృందం, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉండటంతో సకాలంలో చికిత్స అందించి రోగి ప్రాణాలను కాపాడగలిగామని వైద్యులు పేర్కొన్నారు. పేషెంట్ కౌసల్య కుమారుడు మహేష్ మాట్లాడుతూ.. తన తల్లి ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, పరిస్థితి చూసిన కొందరు ఆమె బతకడం కష్టమని చెప్పడంతో భయాందోళనకు గురయ్యామని పేర్కొన్నారు. అయితే మెడికవర్ వైద్యులు అత్యవసరంగా స్పందించి క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి తన తల్లిని సాధారణ స్థితికి తీసుకువచ్చారని, ప్రస్తుతం ఆమె తన పనులు తాను చేసుకుంటుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, అనెస్థీషియా హెడ్ డాక్టర్ వినయ్, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News