Dharmapuri accident: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఒక లారీ సృష్టించిన బీభత్సానికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన తీరు: అతివేగంతో దూసుకొచ్చిన లారీ తొలుత ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగంతోనే పక్కనే వెళ్తున్న ఒక ఆటోపైకి దూసుకెళ్లడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ధాటికి బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులందరూ ధర్మపురి పట్టణానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.
Also read-Students accident: పదో తరగతి పరీక్షకు వెళ్తుండగా బస్సులోంచి పడిపోయిన విద్యార్థినులు.. ఎక్కడ అంటే?
క్షతగాత్రుల పరిస్థితి: ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మితిమీరిన వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

