Homeతెలంగాణకరీంనగర్Sircilla : డిజిటల్ వలలు.. యువతకు సవాళ్లు: అడుగు తడబడితే అంతే సంగతులు

Sircilla : డిజిటల్ వలలు.. యువతకు సవాళ్లు: అడుగు తడబడితే అంతే సంగతులు

సిరిసిల్ల ( తెలుగు ప్రభ ) :  డిజిటల్ విప్లవం ఒకవైపు సరికొత్త అవకాశాల బాటలు పరుస్తుంటే, మరోవైపు సైబర్ కేటుగాళ్లు పన్నుతున్న మాయావ్యూహాలు యువత భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో విహరించే యువతరం అపరిచితుల ఉచ్చులో ఎలా చిక్కుకుంటోంది? ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థి లోకం ఈ పెడధోరణుల నుంచి తప్పుకుని దేశ నిర్మాణంలో ఎలా భాగస్వామ్యం కావాలి?

- Advertisement -

ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ, సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘100 రోజుల త్రివర్ణ పతాక’ ఆవిష్కరణ వేదికగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
ఉన్నత లక్ష్యాలే గమ్యం కావాలి: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విద్యాసంవత్సరంలో జాతీయ జెండాను నిరంతరం ఎగురవేయడం విద్యార్థుల్లో దేశభక్తిని, నైతిక బాధ్యతను పెంపొందిస్తుందని కొనియాడారు. విద్యార్థులు ‘ఆకాశమే హద్దు’గా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు.

సైబర్ మాయాజాలం.. కఠిన నియమాలు : సోషల్ మీడియా వినియోగంలో అత్యంత జాగ్రత్త అవసరమని ఎస్పీ హెచ్చరించారు. నకిలీ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, లక్కీ డ్రాల పేరిట సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు.

డ్రగ్స్ రహిత సమాజం.. రోడ్డు భద్రత : డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారులకు ఆమడదూరంలో ఉండాలని, మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే పోలీసులకు అందించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమని.. హెల్మెట్ ధరిస్తూ రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాయికిరణ్, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ రఘునందన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News