కరీంనగర్ టౌన్(తెలుగు ప్రభ): శాతావాహన యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆదివారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం మెస్‌లో భోజనం అందకపోవడంతో విద్యార్థులు మెయిన్‌గేట్ వద్ద నిరసన చేపట్టారు. మెస్ బిల్లుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నా.. సమయానికి భోజనం అందడం లేదని విద్యార్థులు ఆరోపించారు.యూనివర్సిటీలో సుమారు రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన జిమ్‌ను విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారని, అదనపు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని వారు తెలిపారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన జిమ్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
హాస్టల్ పరిసరాల్లో పాములు కనిపిస్తున్నా తగిన రక్షణ చర్యలు చేపట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో పారిశుద్ధ్య సమస్యలు నెలకొన్నాయని, పలుచోట్ల చెత్త పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగిందని తెలిపారు. చెత్తను వెంటనే తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోవైపు సుమారు రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్, గ్రౌండ్‌ను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రాక్టీస్‌కు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రౌండ్‌ను విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. యూనివర్సిటీ అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ విద్యార్థులకు సమయానికి భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, భద్రత, క్రీడా సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెస్, హాస్టల్, పారిశుద్ధ్యం, జిమ్, క్రీడా మైదానానికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.“కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు.. విద్యార్థులకు కనీసం తిండి, భద్రత, పరిశుభ్రమైన వాతావరణం ఎందుకు కల్పించలేకపోతున్నారు?” అని విద్యార్థులు ప్రశ్నించారు.

