HomeTop StoriesMetpally: పదవి మహిళది.. పెత్తనం మాత్రం ఆయనది!

Metpally: పదవి మహిళది.. పెత్తనం మాత్రం ఆయనది!

  • రిజర్వేషన్‌ ఆమెకు.. పెత్తనం మాత్రం భర్తలు, కుటుంబ సభ్యులదా?
  • 385 పంచాయతీలు.. 5 మున్సిపాలిటీలు
  • వివాదాస్పదమవుతున్న షాడో పాలనపై చర్చ
  • పదవి మహిళది.. సంతకం ఆమెది.. ఆధిపత్యం భర్తలు, కుటుంబ సభ్యులది
  • షాడో పాలన వేధింపులతో అధికారులు, సిబ్బంది పరేషాన్
  • తాజాగా మల్లాపూర్ మండలం సర్పంచ్ భర్తపై విద్యుత్ శాఖ ఉద్యోగుల ఫిర్యాదు

మెట్ పల్లి(తెలుగుప్రభ): ఆమె పేరుతో పదవి.. ఆమె చేతిలో సంతకం.. కానీ అధికారపు చక్రం మాత్రం ఆమె భర్త, కుటుంబ సభ్యులు.. మరొకరి చేతిలో.. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా చోట్ల దాని అసలు ఉద్దేశంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లాలో 385 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉండగా.. మహిళలు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఛైర్మెన్, కౌన్సిలర్లుగా ఎన్నికై ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపడుతున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ ఉన్న 174 చోట్ల ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, కుమారులు లేదా ఇతర కుటుంబ సభ్యులే అధికారులతో మాట్లాడటం, పనులపై నిర్ణయాలు తీసుకోవడం, అభివృద్ధి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రజా సమస్యలను తమ చేతుల్లోకి తీసుకోవడం వివాదాలకు కారణమవుతున్నాయి. దీంతో మహిళలకు పదవి ఇవ్వడం మాత్రమే సాధికారతా లేక ఆ పదవికి సంబంధించిన నిర్ణయాధికారం కూడా మహిళ చేతుల్లోనే ఉండాలా అన్న చర్చ జిల్లాలో ఊపందుకుంటోంది. కుర్చీలో మహిళ.. తెరవెనుక కుటుంబ సభ్యుల షాడో పెత్తనం అనే విమర్శలు నిజమైతే.. అది కేవలం ఒక వ్యక్తి వ్యవహారం కాదు.. మహిళా ప్రాతినిధ్యానికి, స్థానిక ప్రజాస్వామ్యానికి సంబంధించిన కీలక ప్రశ్నగా మారుతుంది. మహిళా ప్రజాప్రతినిధులు స్వయంగా నిర్ణయాలు తీసుకుని అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న అనేక ఉదాహరణలు ఉన్నప్పటికీ, చాలా చోట్ల వినిపిస్తున్న ఈ ఆరోపణలు మాత్రం వ్యవస్థపై చర్చకు దారితీస్తున్నాయి.

- Advertisement -

పేరు ఆమెది.. పాలన వారిదా..

ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నది మహిళా ప్రజాప్రతినిధిని. కానీ చాలా చోట్ల ఆమె స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులే అధికారులను కలవడం, పనులపై మాట్లాడటం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పదవి ఒకరిది.. నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మరొకరైతే జవాబుదారీతనం ఎక్కడ ఉంటుందని అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సంతకానికే పరిమితమా..
కొన్ని చోట్ల మహిళా ప్రజాప్రతినిధులు కేవలం డాక్యుమెంట్లపై సంతకాలు చేయడానికి మాత్రమే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశాల్లో వారి తరఫున భర్తలు లేదా ఇతర కుటుంబ సభ్యులే మాట్లాడటం, అధికారులతో నేరుగా సంప్రదింపులు జరపడం వంటి ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం స్వతంత్రంగా, చురుకుగా పనిచేస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.

మున్సిపాలిటీల్లోనూ ‘షాడో పవర్‌’!

మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్ల పాత్రపైనా కొన్ని చోట్ల చర్చ జరుగుతోంది. ఎన్నికైంది మహిళ.. కానీ వార్డు సమస్యలపై అధికారులను కలిసేది, పనులపై మాట్లాడేది భర్తలు లేదా కుటుంబ సభ్యులే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల జోక్యం పెరగడం, అధికారిక హోదా లేని వ్యక్తులు ఆఫీసులు, వార్డుల్లో హల్చల్ చేస్తుండడంతో నిర్ణయ ప్రక్రియలో ప్రభావం చూపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిలర్‌కు బదులుగా కుటుంబ సభ్యులు ముందుండే పరిస్థితి ఉంటే.. ప్రజలకు జవాబుదారీ ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. మహిళా ప్రజాప్రతినిధుల అధికారిక పాత్రను స్పష్టంగా కాపాడటంతోపాటు, కుటుంబ సభ్యుల అనధికార జోక్యంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

అధికారులకూ తప్పని ఒత్తిళ్ళు..

ప్రజల ద్వారా ఓట్లతో ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక హోదా లేకపోయినా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనులు, ఇతర వ్యవహారాల్లో ప్రశ్నించడం నుంచి తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని అధికారులు, సిబ్బంది పరేశాన్ అవుతున్నారు. దీంతో సంబంధిత అధికారులు ఏమి చేయలేక వారు చెప్పినట్లు నడుచుకుంటూ డ్యూటీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహిళా సాధికారతకు ఎక్కడా..

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం వెనుక ఉద్దేశం సంఖ్య పెంచడం మాత్రమే కాదు.. నిర్ణయ ప్రక్రియలో మహిళల స్వరాన్ని బలపరచడం. మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో కుటుంబ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటే రిజర్వేషన్‌ ద్వారా సాధించాలనుకున్న రాజకీయ సాధికారత లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News