Kalvakuntla Kavitha warns Andhra leaders : తెలంగాణ రాజకీయాలు మరోసారి ‘అస్తిత్వం’ వేదికగా సెగలు రేపుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. “నేను అనుకున్నంత మంచిదాన్ని కాదు.. చాలా మొండిదాన్ని” అంటూనే, ఏపీ నేతలకు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఆమె సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్రా నేతల విగ్రహాలను పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కవిత.. “మేము అధికారంలోకి రాగానే ఆ విగ్రహాలను పగలగొట్టి, ఆంధ్రాకు పార్సల్ పంపుతాం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ 2.0 తో జాగ్రత్త.. మూతి పళ్లు రాలుతాయి! : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన “తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.”ఇది టీఆర్ఎస్ 2.0 మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు. ఒకసారి గట్టిగా నిలబడితేనే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి” అంటూ కవిత కంచుకంఠంతో హెచ్చరించారు.
ఆంధ్రా ప్రజలు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ, తెలంగాణ నీళ్లు, నిధులు, రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం అస్సలు సహించేది లేదని కవిత స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారంతా తమవారేనని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి ‘ఆంధ్రా ఏజెంట్’.. విగ్రహాలు కూలగొడతాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు చేశారు.రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రా పాలకులకు ‘ఏజెంట్’ లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ఇష్టానుసారంగా హైదరాబాద్‌లో మళ్లీ ఆంధ్రా నేతల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని ఆక్షేపించారు. “మేము అధికారంలోకి రాగానే ఆ ఆంధ్రా నేతల విగ్రహాలను పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ చేస్తాం” అని కుండబద్ధలు కొట్టారు. రేవంత్‌రెడ్డి గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి అంగీకరించి తెలంగాణ హక్కులకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని, దీనిపై మేధావులు ప్రశ్నిస్తే ఆంధ్రా పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు.
పవన్, లోకేశ్‌లకు చురకలు: ఇది మీ సామ్రాజ్యం కాదు! : తెలంగాణలో జనసేన, టీడీపీల విస్తరణ ప్రణాళికలపై కవిత ఘాటుగా స్పందించారు. తెలంగాణలో నవనిర్మాణ సభ పెడతామంటున్న పవన్ కళ్యాణ్‌కు, ఇక్కడ పార్టీని విస్తరిస్తామని చెప్తున్న లోకేశ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ గారూ.. మీరు ఇక్కడ సభ పెట్టే ముందు, మీ సెక్రటేరియట్‌లోకి వాన నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వర్షాకాలంలో మీ రాజధాని అమరావతి మునిగిపోతుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం?” అని ప్రశ్నించారు. “రాష్ట్రం విడిపోయి 13 ఏళ్లు కావస్తున్నా ఆంధ్రా నేతలకు కనీసం ఒక సరైన రాజధాని కట్టుకోవడం చేతకాలేదు. ఇక్కడి ప్రజల దృష్టిని మళ్లించడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు” అని మండిపడ్డారు.”వైసీపీ అధినేత జగన్ పేల్చిన ‘మావిగన్ (MAVIGUN)’ పొలిటికల్ బాంబును తట్టుకోలేకే కూటమి నేతలు తెలంగాణ మీద పడి ఏడుస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. “తెలంగాణలో ఎక్స్‌టెన్షన్ కావడానికి ఇది మీ సామ్రాజ్యం కాదు. ఇక్కడి ప్రజలు ఆంధ్రా పార్టీలకు ఓట్లేయరని దుకాణం బంద్ చేసుకున్న విషయం లోకేశ్ బాబు గుర్తుంచుకోవాలి” అని చురకలంటించారు.
ఆంధ్రా మంత్రులకు హాస్పిటల్స్ లేవా? : ఆంధ్రప్రదేశ్‌లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కవిత విమర్శించారు. “ఇప్పటికీ చిన్న ఆపరేషన్ల కోసం కూడా ఆంధ్రా ప్రజలు, మంత్రులు హైదరాబాద్ ఆసుపత్రులకు రావాల్సి వస్తోంది. అనంతపురం వాళ్లు బెంగళూరుకు, నెల్లూరు వాళ్లు చెన్నైకి వెళ్తున్నారు. ఏపీ ప్రజలకు మీరు అందిస్తున్న సుపరిపాలన ఇదేనా?” అని నిలదీశారు.

