Sunday, February 8, 2026
HomeతెలంగాణNagoba Jatara: నేటి నుంచి నాగోబా జాతర.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Nagoba Jatara: నేటి నుంచి నాగోబా జాతర.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Nagoba Jatara in Keslapur: ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మరో జాతర నేటి నుంచి జరగనుంది. అదికూడా తెలంగాణలోనే కావడం విశేషం. అదే నాగోబా జాతర. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ నాగోబా జాతర.. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నేడు ప్రారంభం కానుంది. పూర్తి గిరిజనులు మాత్రమే పాల్గొనే జాతర నాగోబా జాతర. ఈ జాతరలో సర్పజాతిని పూజించడమే ప్రత్యేకత. అమావాస్య రోజు ఆరాధ్య దైవం నాగోబా(శేషనారాయణమూర్తి) పురి విప్పి నాట్యమాడతాడని గిరిజనుల అపార నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా రాత్రి 7 గంటల నుంచి 12 గంటల మధ్యలో గిరిజన పూజారులకు ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. నేడు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 10 గంటలకు మహాపూజతో ఈ జాతర ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడంతో ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. జాతరలో భాగంగా ఈనెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదేరోజు పురుషులు మాత్రమే పాల్గొనే పూజలతో పాటు మహిళలు విశేషంగా పాల్గొనే భాన్‌ దేవత పూజలను సైతం నిర్వహిస్తారు. ఈనెల 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌ నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23న భేతల్‌ పూజలు, మండ గాజిలింగ్‌ కార్యక్రమాలతో మెస్రం వంశీయల సంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ, భక్తుల రద్దీ మాత్రం ఈనెల 25 వరకు కొనసాగనుంది.

- Advertisement -

గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట..

అయితే, నాగోబా జాతరలో మెస్రం వంశీయులు తమ ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల రోజుల ముందు పుష్య మాసం మొదలయ్యాక నెలవంకను చూడటంతో ఈ మహా ఘట్టానికి అంకురార్పన జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తినమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే ఏడు గ్రామాల మీదుగా మెస్రం వంశీయులు పాదయాత్రగా బయలుదేరుతారు. పూర్తిగా తెల్ల దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియ చేపడతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్‌ పొలిమేరలోని మర్రిచెట్టు వద్దకు చేరుకుంటారు. దీనితో నాగోబా జాతర పూర్తవుతుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News