Key Update on Bandi Bhagirath POCSO case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం బాధితురాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టుకు హాజరైంది. బాధితురాలు మెజిస్ట్రేట్ ఎదుట హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పటికే రెండుసార్లు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగా, ఇవాళ బాధితురాలితో పాటు ఆమె తల్లి స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు, తన కుమార్తెను మద్యం సేవించమని బండి భగీరథ్ ఒత్తిడి చేసి.. ఆమె బలహీన స్థితిలో ఉన్న సమయంలో లైంగికంగా వేధించాడని బాధితురాలి తల్లి తాజాగా విడుదల చేసిన లేఖలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తె చాలా రోజులు అవమానంగా.. మానసిక వేదనను అనుభవించిందని ఆమె పేర్కొన్నారు.
పరారీలో బండి భగీరథ్.. లుకౌట్ నోటీసులు జారీ..
ఈ వ్యవహారంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని.. నిజానిజాలు త్వరలోనే తప్పకుండా బయటికి వస్తాయని బాధితురాలి తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ వద్ద వాట్సాప్ చాటింగ్‌లు, మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ కేసులో విచారణ నిమిత్తం రావాల్సిందిగా బండి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, పోలీసుల విచారణకు భగీరథ్ గైర్హాజరయ్యారు. ప్రస్తుతం, బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

