టేకులపల్లి(తెలుగు ప్రభ): టేకులపల్లి మండల కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఓ అరుదైన ప్రకృతి వింత స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. మండల పరిధిలోని ధరావత్ తావుర్య నాయక్ నివాసంలో ఉన్న మందారం చెట్టుకు ఒకే పువ్వు రెండు వేర్వేరు రంగులతో వికసించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ద్వివర్ణ మందారం: ఆ పువ్వులో సగభాగం ఒక రంగులో, మిగతా సగభాగం మరో రంగులో కనిపించడంతో ఈ ద్వివర్ణ మందారం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా ఒకే రంగులో వికసించే మందారం ఇలా రెండు రంగుల సమ్మేళనంతో కనిపించడంతో విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు, కాలనీవాసులు తావుర్య నాయక్ ఇంటికి చేరుకుని పువ్వును ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఈ అరుదైన పువ్వు కనిపించడం మరింత విశేషంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రకృతి తనదైన శైలిలో చూపించిన ఈ వింతను చూసేందుకు వచ్చిన వారు ఫొటోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు

