Homeతెలంగాణఖమ్మంLeadership : కేంద్రంలో కేక... భద్రాద్రిలో బెదురు.. భాజపా జిల్లా నాయకత్వంపై ప్రశ్నల తుపాను

Leadership : కేంద్రంలో కేక… భద్రాద్రిలో బెదురు.. భాజపా జిల్లా నాయకత్వంపై ప్రశ్నల తుపాను

కొత్తగూడెం (తెలుగు ప్రభ): ఢిల్లీ పీఠంపై వరుస విజయాలతో జాతీయ స్థాయిలో జయకేతనం ఎగురవేస్తున్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తెలంగాణలోని గిరిజన, పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ‘కమలం’ పువ్వు ఎందుకు వికసించలేకపోతోంది? కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సింగరేణి బొగ్గు గనుల విస్తారమైన కార్మిక బలం పటిష్టమైన రాజకీయ పునాదికి అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. భాజపా ఇక్కడ ఎందుకు వెనుకబడుతోంది? పటిష్టమైన ప్రజా పునాది నిర్మించడంలో జిల్లా నాయకత్వం వైఫల్యం చెందిందా అనే విమర్శలు స్వయంగా పార్టీ శ్రేణుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. 

- Advertisement -

ఫొటోలకే పరిమితమైన నాయకత్వం… క్షేత్రస్థాయి నిశ్శబ్దం : ఒక రాజకీయ పార్టీకి పునాది వంటిది క్షేత్రస్థాయి శ్రేణుల బలం. కేవలం కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలు, ప్రకటనలతో పార్టీలు బలపడవనేది బహిరంగ రహస్యం. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాయకత్వం పార్టీని కేవలం పత్రికా ప్రకటనలు, అంతర్గత సమావేశాలు, ఫొటో షూట్‌లకే పరిమితం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి గ్రామంలో పార్టీకి ఒక క్రియాశీలక నాయకుడు, బలమైన కార్యకర్తల బృందాన్ని తయారు చేయడంలో జిల్లా నాయకత్వం “మాటల కోటలు దాటడమే తప్ప… ఆచరణలో ముందడుగు వేయడం లేదు” అనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

స్థానిక సంస్థల్లో ఉనికి ప్రశ్నార్థకమేనా? : పార్టీ బలాన్ని అంచనా వేయడానికి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలే కీలకమైన కొలమానం. జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ కనీసం ఒక సర్పంచ్‌, ఎంపీటీసీ లేదా మున్సిపల్ కౌన్సిలర్ స్థానాన్ని కూడా స్వతంత్రంగా గెలిపించుకోలేని స్థితిలో ఉందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రామాల వారీగా అభ్యర్థులను సిద్ధం చేసుకోకపోతే.. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే వలస నాయకులపై ఆధారపడక తప్పని ‘చుక్కాని లేని నావ’లా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి.

కేంద్ర పథకాల ఉనికి… ప్రచారంలో నిమ్మకు నీరెత్తిన తీరు : ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎం విశ్వకర్మ, పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, ముద్రా, ఉజ్జ్వల వంటి కేంద్ర పథకాలు పేదల జీవితాల్లో మార్పు తెస్తున్నప్పటికీ.. వాటిని ఓటు బ్యాంకుగా మలచుకోవడంలో స్థానిక నేతలు విఫలమవుతున్నారు. మండల స్థాయిల్లో లబ్ధిదారులకు మార్గదర్శనం చేయడం, దరఖాస్తు ప్రక్రియలో సాయపడడం వంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కేంద్ర నిధుల ఫలితాలను అధికార పార్టీలు తమ ఖాతాలో వేసుకుంటున్నాయి.

సింగరేణి కార్మిక క్షేత్రంలో కరవైన ఉద్యమ స్ఫూర్తి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గుండెకాయ వంటి సింగరేణి సంస్థలో వేలాది మంది కార్మికులు ఉన్నారు. వేతన ఒప్పందాలు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం, కొత్త ప్రాజెక్టుల సాధన వంటి కీలక అంశాలపై భాజపా నిరంతర పోరాటాలు. యువజన, మహిళా, బీసీ, ఎస్టీ మోర్చాలను ఒకే రాజకీయ వేదికపైకి తెచ్చి కార్మిక, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు నిర్మించడంలో జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News