Homeతెలంగాణఖమ్మంAswaraopeta: అడ్డూఅదుపు లేని గ్యాస్ దందా

Aswaraopeta: అడ్డూఅదుపు లేని గ్యాస్ దందా

*సామాన్యుడి సబ్సిడీ బండలపై రెస్టారెంట్ల కన్ను

- Advertisement -

*కమర్షియల్ బండలు వాడకుండా, సబ్సిడీ (డొమెస్టిక్) గ్యాస్ వాడకం

*సబ్సిడీ సిలిండర్లు హోటళ్లకు మళ్లడంతో సామాన్యులకు కొరత

*అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమ దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

అశ్వారావుపేట, (తెలుగు ప్రభ): అశ్వారావుపేట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ బండల వినియోగం బహిరంగంగానే సాగుతోంది. పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపుల్లో కేవలం వాణిజ్య అవసరాల (కమర్షియల్) కోసం కేటాయించిన నీలం రంగు గ్యాస్ సిలిండర్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ, స్థానిక హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను కాగితాలకే పరిమితం చేస్తూ, సామాన్య ప్రజలకు సబ్సిడీపై అందే గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను యథేచ్ఛగా వాడేస్తున్నారు.

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.. అక్రమ రీఫిల్లింగ్ దందా
మండల పరిధిలోని చిన్న, పెద్ద తేడా లేకుండా దాదాపు అన్ని హోటళ్లలోనూ గృహ వినియోగ గ్యాస్ బండలే దర్శనమిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు ఎక్కువగా ఉండటంతో, వ్యయం తగ్గించుకునేందుకు హోటల్ యజమానులు సబ్సిడీ ధరకు లభించే గృహ సిలిండర్లను అక్రమ మార్గాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు కొందరు అక్రమార్కులు పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు, అలాగే డొమెస్టిక్ బండల నుంచి కమర్షియల్ బండలకు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ దందా వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

సామాన్యుడి గ్యాస్‌కు గండి.. సగానికి తగ్గిన ప్రామాణికత
హోటళ్ల యజమానులు గృహ సిలిండర్లను అక్రమంగా దారి మళ్లించడంతో, గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణ వినియోగదారులకు ససమయానికి సిలిండర్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఒక సామాన్య కుటుంబానికి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు నిరంతరాయంగా వచ్చేదని, కానీ ఇప్పుడు నెల రోజులు కూడా రావడం లేదని వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలోనే సిలిండర్లలో నుంచి కొంత గ్యాస్‌ను అక్రమంగా తీసివేసి, పరిమాణం తగ్గించి వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారనే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నీళ్ల బేసిన్లలో సిలిండర్లు.. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో!
హోటళ్ల నిర్వాహకులు కేవలం గృహ వినియోగ సిలిండర్లను వాడటమే కాకుండా, త్వరగా వంటలు పూర్తి చేసేందుకు గ్యాస్ ప్రెజర్ పెంచే క్రమంలో సిలిండర్లను వేడి నీళ్ల బేసిన్లలో ఉంచి వాడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, చిన్నపాటి పొరపాటు జరిగినా పెద్ద ఎత్తున విస్ఫోటనం సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిద్రమత్తు వీడాలని అధికారుల ముందు స్థానికుల డిమాండ్
ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరల భారంతో సామాన్యుడు అల్లాడుతుంటే, మరోవైపు గృహ అవసరాలకు రావాల్సిన సబ్సిడీ గ్యాస్ వ్యాపారుల పాలు కావడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లైస్) మరియు సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులు నిద్రమత్తు వీడి, మండలంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ కొట్టులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా గ్యాస్ వాడుతున్న హోటళ్లపై కేసులు నమోదు చేసి, సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News