Homeతెలంగాణఖమ్మంFake Vizag Steel: అశ్వారావుపేటలో నకిలీ 'వైజాగ్' స్టీల్ కలకలం.. రూ.కోట్లలో దందా

Fake Vizag Steel: అశ్వారావుపేటలో నకిలీ ‘వైజాగ్’ స్టీల్ కలకలం.. రూ.కోట్లలో దందా

అశ్వారావుపేట, (తెలుగు ప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో నకిలీ వైజాగ్ స్టీల్ దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. నిర్మాణ రంగానికి అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా పేరొందిన విశాఖపట్నం ఐరన్ (వైజాగ్ టీఎంటీ) పేరుతో కొందరు కేటుగాళ్లు నాసిరకం స్టీలును విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని ఒక బంగారు షాపు పక్కన ఉన్న ఐరన్ దుకాణంలో ఈ డూప్లికేట్ ఐరన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే వార్తలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

- Advertisement -

ఉత్పత్తి తగ్గిన వేళ.. వందల టన్నుల స్టీల్ ఎక్కడిది?

నిర్మాణ రంగంలో నాణ్యతకు మార్గదర్శకంగా నిలిచే ‘వైజాగ్ టీఎంటీ 550 డి’ లోగోతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత మూడు దశాబ్దాలుగా స్టీల్ రాడ్లను విక్రయిస్తోంది. అయితే, ఇటీవల విశాఖ ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు, గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో స్టీల్ బ్లూమ్స్ నుంచి టీఎంటీ బార్ల తయారీ దాదాపుగా నిలిచిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అంతటా వైజాగ్ స్టీల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. అసలు ప్లాంట్‌లోనే ఉత్పత్తి నిలిచిపోయినప్పుడు, అశ్వారావుపేటలోని ఈ ఒక్క ఐరన్ దుకాణానికి వందల టన్నుల వైజాగ్ స్టీల్ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

స్థానిక వ్యాపారులు కొందరు అక్రమార్కులతో చేతులు కలిపి, స్థానిక/నాసిరకం రోలింగ్ మిల్లుల్లో తయారైన ఐరన్ రాడ్లపై కృత్రిమంగా ‘వైజాగ్ టీఎంటీ’ బ్రాండ్ ముద్రలు వేసి అసలు ధర కంటే కాస్త తక్కువ ధరకు ఆశచూపి విక్రయిస్తున్నారని సమాచారం. ఇళ్లను, శాశ్వత నిర్మాణాలను ఎంతో ఆశతో నిర్మించుకునే సామాన్య ప్రజలు ఈ నకిలీ స్టీలును నమ్మి కొనుగోలు చేసి నిలువునా మోసపోతున్నారు. భవిష్యత్తులో ఈ నాసిరకం స్టీలు వల్ల భవనాల దృఢత్వం దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టాలి

వినియోగదారులను నిలువునా ముంచుతున్న ఈ నకిలీ స్టీల్ ముఠాపై మరియు సదరు దుకాణ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్, మైనింగ్ మరియు క్వాలిటీ కంట్రోల్ అధికారులు తక్షణమే స్పందించి అశ్వారావుపేటలోని ఐరన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, స్టీల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నకిలీ స్టీల్ విక్రయిస్తున్న వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News