*భద్రాచలం లాడ్జిలో ఉరివేసుకున్న పాల్వంచ ఉద్యోగి
*సూసైడ్ నోట్ లభ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు
భద్రాచలం, ( తెలుగు ప్రభ):ఆరోపణలు, ఫిర్యాదుల ఒత్తిడి తట్టుకోలేక ఓ ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన భద్రాచలంలో వెలుగుచూసింది.బాధితుడు, పోలీసుల వివరాల ప్రకారం.. పాల్వంచలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ (56) శనివారం హఠాత్తుగా ఇంట్లోంచి బయటకు వెళ్లారు. తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన కుమార్తె, ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసింది. భద్రాచలంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకుంది.
లాడ్జి సిబ్బందితో కలిసి గది తలుపులు తీసి చూడగా లక్ష్మీనారాయణ ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు:
కొందరు వ్యక్తులు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

