HomeTop StoriesMulakalapalli: మృత్యుఒడి నుంచి క్షేమంగా..!

Mulakalapalli: మృత్యుఒడి నుంచి క్షేమంగా..!

​8 గంటల పాటు నరకయాతన

- Advertisement -

​డ్రోన్‌తో ఆచూకీ లభ్యం.. తాళ్లు, లైఫ్‌జాకెట్లతో బయటకు తెచ్చిన వైనం

​రెస్క్యూ సిబ్బందికి జేజేలు పలికిన గ్రామస్థులు

ములకలపల్లి, (తెలుగుప్రభ): ​చుట్టూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వరద ప్రవాహం.. ఏ క్షణాన కొట్టుకుపోతాడో తెలియని భయానక వాతావరణం.. దాదాపు ఎనిమిది గంటల పాటు మృత్యువుతో పోరాడిన యువకుడిని సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి కాపాడాయి. ​మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు మూకమామిడి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. దీంతో స్థానిక వాగు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మిరియాల మధు అనే యువకుడు ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, పోలీస్, పంచాయతీ యంత్రాంగంతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ టీం అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

​వరద ఉధృతి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ఆపరేషన్ సవాలుగా మారింది. రంగంలోకి దిగిన బృందం తొలుత డ్రోన్ కెమెరా సాయంతో మధు ఎక్కడ చిక్కుకున్నాడో గుర్తించింది. అనంతరం ప్రాణాలను ఫణంగా పెట్టి తాళ్లు, లైఫ్‌జాకెట్ల సహాయంతో నీటిలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఎనిమిది గంటల సుదీర్ఘ శ్రమ తర్వాత అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. యువకుడు క్షేమంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

​సకాలంలో స్పందించి ప్రాణం నిలిపారు: సర్పంచ్
ప్రాణాలకు తెగించి యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీస్, రెవెన్యూ, డిజాస్టర్, వ్యవసాయ, పంచాయతీ సిబ్బందికి మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్లే ఓ నిండు ప్రాణం దక్కిందని ఆమె కొనియాడారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలెవరూ వాగులు, వంకల వైపు వెళ్లరాదని, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే పంచాయతీ పాలకవర్గానికి సమాచారం అందించాలని ఆమె కోరారు.

Also Read: Betupalli: బేతుపల్లి చెరువులో పెను ప్రమాదం: 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News