పంట నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా
అత్యధికంగా వరి, పత్తి పైర్లకే తీవ్ర నష్టం
నేటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన
రైతులు అధైర్యపడవద్దు మండల వ్యవసాయ అధికారి అరుణ్‌బాబు
ములకలపల్లి, (తెలుగుప్రభ): ఇటీవల సంభవించిన తుపాను వర్షాలు, వరదల తాకిడికి ములకలపల్లి మండలంలో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉధృతంగా ప్రవహించిన వరద నీరు పొలాలను ముంచెత్తడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు మండలంలో సుమారు 3,535 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.వరి: 1,850 ఎకరాలు, పత్తి: 1,500 ఎకరాలు,వేరుశనగ: 160 ఎకరాలు,మినుములు: 25 ఎకరాలు

ముఖ్యంగా చేతికొచ్చిన వరి, పత్తి, వేరు శనగ పంటలు నీటిపాలు కావడంతో రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.గురువారం నుంచి వ్యవసాయ శాఖ బృందాలు గ్రామాల వారీగా పర్యటించి, ప్రతి పొలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందిస్తాయని మండల వ్యవసాయ అధికారి (ఏవో) అరుణ్‌బాబు తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు.

వరద ముంపునకు గురైన రైతులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ గ్రామానికి చెందిన సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని (ఏఈవో) సంప్రదించి పంట నష్టం వివరాలు నమోదు చేయించుకోవాలని అరుణ్‌బాబు విజ్ఞప్తి చేశారు. నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని అన్నారు.
Also Read:Maheshwaram Medical College: మహేశ్వరం మెడికల్ కాలేజ్ కి మహర్దశ ఎప్పుడు?

