- ప్రాజెక్ట్ జలకళతో రైతుల్లో ఆనందం.. పంటలు సమృద్ధిగా పండాలని ఎమ్మెల్యే ప్రార్థన
పెనుబల్లి (తెలుగు ప్రభ): పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రాజెక్ట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదేవికి పూలు, వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండటం రైతులకు, ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. జలవనరులు సమృద్ధిగా ఉండటం వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని, రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగి పంటలు సమృద్ధిగా పండేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని గంగాదేవిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన్ కమల్ పాషా, కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

