బూర్గంపాడు,(తెలుగు ప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీలోని భాస్కర్నగర్ ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు తిష్ఠవేశాయి. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోవడంతోపాటు మద్యం సీసాలు కనిపిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే మరుగుదొడ్డితో ఇబ్బందులు
పాఠశాలలో బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకే మరుగుదొడ్డిని వినియోగించాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. పాఠశాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.
పౌష్టికాహారంపైనా ఆరోపణలు
విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు పేర్కొన్నారు.
పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాఠశాల పరిస్థితిని వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

