*కుళ్లిపోయిన గుడ్లను అమ్ముతున్న కిరాణా వ్యాపారులు!
*ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు నాణ్యత లేని, కుళ్లిన గుడ్ల అమ్మకం
* ఒక్కో గుడ్డును రూ. 8 చొప్పున అధిక ధరలకు విక్రయం
అశ్వారావుపేట, (తెలుగు ప్రభ): అశ్వారావుపేట మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో కొందరు కిరాణా షాపుల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో దారుణంగా చెలగాటమాడుతున్నారు. ఏజెన్సీ పరిధిలోని లోపలి గ్రామాల్లో నివసించే అమాయక, తెలిసీతెలియని గిరిజన ప్రజలను లక్ష్యంగా చేసుకుని, నాణ్యత లేని, తీవ్రంగా కుళ్లిపోయిన కోడిగుడ్లను విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
రూ. 8 పెట్టి గుడ్డు కొంటే ఉడికిస్తే విపరీతమైన దుర్వాసన
ప్రస్తుతం మండల వ్యాప్తంగా ఒక్కో గుడ్డును రూ. 8 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తీరా పేద ప్రజలు, గిరిజనులు తమ కష్టార్జితంతో ఆ గుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి ఉడకబెడితే, అవి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో తినలేక పారబోయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా గర్భిణీ మహిళలు నిత్యం పోషకాహారం కోసం గుడ్లను తింటుంటారని, అలాంటి అత్యవసర ఆహారంలోనూ ఈ తరహా కల్తీ, కుళ్లిన పదార్థాలను అమ్మి మోసం చేయడంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు.. కఠిన చర్యలకు డిమాండ్
నిత్యం తినే ఆహార పదార్థాలలో కనీస నాణ్యతా ప్రమాణాలు లేకపోవడమే కాకుండా, కుళ్లిపోయిన గుడ్లను ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణ కరువ్వడం వల్లే ఇటువంటి అనైతిక వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత), సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల కిరాణా షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కుళ్లిన సరుకులను స్వాధీనం చేసుకోవాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

