Velugumatla Rehabilitation: ఖమ్మం భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మరి కొంతమందికి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు సహకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/lpg-commercial-cylinders-shortage-in-telugu-states/
వెలుగుమట్ల నిరాశ్రయులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. భూదాన్ భూముల వివాదానికి సంబంధించి ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించింది. 311 కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు, మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా, వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. మొత్తం 766 మంది బాధితులు ఉండగా.. 412 మందిని అర్హులుగా గుర్తించారు.
పట్టాలు పొందిన లబ్ధిదారులు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థిక సహాయం, పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులను పిలిచి రెవెన్యూ అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
Also Read: https://teluguprabha.net/gallery/vijay-rashmika-couple-mehandi-celebrations-photos/
ఫిబ్రవరి 24న వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించారనే కారణంతో వందలాది ఇళ్లను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా, ఇళ్లను కూల్చివేసిన ప్రాంతంలో ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు మౌలిక వసతులు కల్పించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

