Kiren Rijiju Counter to Revanth Reddy: ఉత్తర- దక్షిణ భారతదేశం మధ్య విభజనను ప్రేరేపిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. దయచేసి దేశాన్ని విభజించే ప్రయత్నం చేయవద్దని.. మనమంతా భారతీయులమేనంటూ రేవంత్ రెడ్డికి రిజిజు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల నుంచి వచ్చే పన్నులను ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి వాడుతున్నారని, దక్షిణాది ప్రజలను ‘ద్వితీయ శ్రేణి పౌరులు’గా చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారతదేశానికి చెందినవారేనని, దక్షిణాదికి ప్రాతినిధ్యం వహించే శక్తి బీజేపీకి లేదని విమర్శించారు.
‘దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశాన్ని విభజించే ప్రయత్నం చేయొద్దు. మనమంతా భారతీయులం. రాష్ట్రపతి తూర్పు భారత్‌లోని ఒడిశాలో గిరిజన వర్గానికి చెందిన వారు. ప్రధాని పశ్చిమ భారత్‌లో గుజరాత్‌కు చెందిన నాయకుడు. ఉపరాష్ట్రపతి దక్షిణ భారత్‌లోని తమిళనాడుకు చెందిన వ్యక్తి.’ -కిరణ్ రిజిజు
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కిరణ్ రిజిజు, ‘ఎక్స్’ వేదికగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్వీట్ చేశారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు దేశ వైవిధ్యానికి ప్రతీకలని రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత రాష్ట్రపతి తూర్పు భారతదేశంలోని ఒడిశాకు చెందిన ఒక సాధారణ, అంకితభావం గల గిరిజన మహిళ అని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి పశ్చిమ భారత్‌లోని గుజరాత్‌లో జన్మించిన దూరదృష్టి గల నాయకుడని చెప్పారు. ఉపరాష్ట్రపతి దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన సాధారణ వ్యక్తి అని వివరించారు.
కాంగ్రెస్ విధానాలపై విమర్శలు: రేవంత్ రెడ్డి కూడా తన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలాగే మాట్లాడుతున్నారని, ప్రాంతాల పేరుతో దేశాన్ని విడగొట్టే రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా కిరణ్ రిజిజు హితవు పలికారు.

