HomeతెలంగాణRailway Station : మల్లన్న ముంగిట రైలు సవ్వడి.. రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటే తరువాయి

Railway Station : మల్లన్న ముంగిట రైలు సవ్వడి.. రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటే తరువాయి

Komuravelli Railway Station train timings and reservation counter demand : సిద్ధి పురిలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, భక్తజనుల నిలయం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య క్షేత్రం ఇకపై రైలు కూతతో మైమరపిస్తోంది. ఏటా తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకునే ఈ క్షేత్రానికి రైల్వే లైన్ అందుబాటులోకి రావడం ఒక చారిత్రాత్మక మలుపు. 

- Advertisement -

రూ.200 ఛార్జీకి చెక్.. రూ.25కే సికింద్రాబాద్ : కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునే భక్తులలో దాదాపు 70 శాతానికి పైగా పేద, మధ్యతరగతి వర్గాలవారే. గతంలో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి రూ. 150 నుంచి రూ. 200 వరకు రవాణా ఖర్చు అయ్యేది. కానీ, ఇప్పుడు కొమురవెల్లి హాల్ట్ స్టేషన్ అందుబాటులోకి రావడంతో కేవలం రూ. 25 అతి తక్కువ టికెట్ ధరతోనే సికింద్రాబాద్ చేరుకునే సువర్ణావకాశం లభించింది. భక్తులకే కాకుండా చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట మండలాల వ్యాపారులు, ఉన్నత చదువుల కోసం నగరాలకు వెళ్లే ప్రతినిత్యం 300 నుండి 400 మంది విద్యార్థులకు ఈ మార్గం వరప్రదాయినిగా మారింది.

కొమురవెల్లి రైల్వేస్టేషన్ – ప్రస్తుత రైళ్ల సమయ వేళలు  : ప్రస్తుతం సికింద్రాబాద్ – సిద్దిపేట మధ్య నడుస్తున్న 4 డెమూ (DEMU) రైళ్లను కొమురవెల్లి స్టేషన్‌లో నిలుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారిక వేళల ప్రకారం.

రైలు నంబరు 77654 (సిద్దిపేట – సికింద్రాబాద్): బుధవారం మినహా ప్రతిరోజూ మధ్యాహ్నం 02:38 గంటలకు కొమురవెల్లికి చేరుకుంటుంది.

రైలు నంబరు 77656 (సిద్దిపేట – సికింద్రాబాద్): గురువారం మినహా ప్రతిరోజూ ఉదయం 06:45 గంటలకు అందుబాటులో ఉంటుంది.

రైలు నంబరు 77653 (సికింద్రాబాద్ – సిద్దిపేట): బుధవారం మినహా ప్రతిరోజూ మధ్యాహ్నం 12:44 గంటలకు కొమురవెల్లికి వస్తుంది.

రైలు నంబరు 77655 (సికింద్రాబాద్ – సిద్దిపేట): ప్రతిరోజూ రాత్రి 08:04 గంటలకు కొమురవెల్లి చేరుకుంటుంది.

రిజర్వేషన్ కౌంటర్’ ఏర్పాటే తక్షణ డిమాండ్ : ప్రస్తుతం స్టేషన్‌లో సాధారణ హాల్ట్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే నాలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చే గ్రామీణ, వయోవృద్ధ భక్తులకు స్మార్ట్‌ఫోన్లలో ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకోవడం రాక అవస్థలు పడుతున్నారు. స్టేషన్‌లోనే ప్రత్యక్ష రిజర్వేషన్ కౌంటర్ (PRS) ఏర్పాటు చేస్తే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు తిరుగు ప్రయాణం సులభతరం అవుతుందని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాలు, జాతర వేళ అదనపు రైళ్లు.. షటిల్ బస్సుల విజ్ఞప్తి : సాధారణ రోజుల్లో రోజూ 5,000 నుంచి 15,000 మంది భక్తులు వస్తుండగా, మరో నాలుగు నెలల్లో ప్రారంభం కానున్న ‘మల్లన్న జాతర’ మరియు బ్రహ్మోత్సవాల సమయంలో రోజువారీ భక్తుల సంఖ్య 50,000 నుంచి 70,000 దాటుతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని జాతర సమయంలో సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి అదనపు ప్రత్యేక రైళ్లు నడపాలని, రైల్వేస్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి భక్తులను తీసుకెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘షటిల్ బస్సులు’ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

రహదారి ప్రయాణ యాతనకు స్వస్తి : గతంలో హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమురవెల్లికి చేరుకోవాలంటే రాజీవ్ రహదారిపై బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. రెండు మూడు వాహనాలు మారాల్సి రావడంతో సమయంతో పాటు డబ్బూ వృథా అయ్యేది. ఈ నూతన రైలు మార్గం ప్రయాణికుల కష్టాలను అధిగమించేలా చేసి, భక్తి ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News