Telangana Congress internal dispute : తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపుతున్న వరంగల్ రాజకీయ పంచాయితీ చివరకు ఢిల్లీ పెద్దల ముంగిట చేరింది. సొంత పార్టీ నేతల మధ్య ‘నివురుగప్పిన నిప్పులా’ మారిన విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంతో అధిష్ఠానం రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తాజాగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో అత్యవసరంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన అనుమతి లేకుండా తన శాఖపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షలు జరపడం ప్రోటోకాల్ ఉల్లంఘనేనంటూ సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
వివాదానికి దారితీసిన సమీక్షల వ్యవహారం: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా మండిపడ్డారు. తనకు తెలియకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కడియం సమీక్షా సమావేశం నిర్వహించడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసిన మంత్రి సురేఖ, తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు.
తన పని తాను చేసుకుంటుంటే అనవసర జోక్యం: ఈ భేటీ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తన ఆవేదనను ఇన్ఛార్జ్ ముందు ఉంచారు. తను ప్రశాంతంగా తన మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తుంటే, కొందరు నేతలు అనవసరంగా తన పరిధిలోకి వచ్చి తనను బయటకు లాగుతున్నారని ఆరోపించారు. అధికారులతో సమీక్షల పేరిట మంత్రి హోదాలో ఉన్న తన అధికారాలను ప్రక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు.
సంయమనం పాటించాలన్న ఇన్ఛార్జ్ హితబోధ: మంత్రి కొండా సురేఖ వాదనను సహనంతో విన్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమెకు కీలక సూచనలు చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంయమనం పాటించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం సజావుగా సాగాలంటే నాయకుల మధ్య సమన్వయం ఉండాలని సూచిస్తూ, చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
బీసీ లీడర్‌గా పెద్ద బాధ్యత: ఈ వివాదాల నుంచి బయటకు వచ్చి, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని మీనాక్షి సూచించారు. కొండా సురేఖకు పార్టీలో ఒక సీనియర్ బీసీ నాయకురాలిగా ఎంతో గుర్తింపు ఉందని, బలమైన బీసీ లీడర్‌గా పార్టీలో ఆమెకు పెద్ద బాధ్యత ఉందని గుర్తుచేశారు. వ్యక్తిగత కలహాలకు స్వస్తి చెప్పి, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

