హైదరాబాద్, సెప్టెంబర్ 15 (తెలుగుప్రభ): మాజీ మంత్రి కొండా సురేఖకు సచివాలయంలో కేటాయించిన ఛాంబర్‌తో పాటు మూడు పేషీలను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలోని నాలుగో అంతస్తు నాలుగో విభాగంలో ఉన్న 10, 11, 12 నంబర్ కార్యాలయ గదులకు అధికారులు తాళాలు వేశారు. కొండా సురేఖ ఛాంబర్ వద్ద ఉన్న నేమ్‌బోర్డును సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు తొలగించారు. ఆమె పేషీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించడంతోపాటు పలువురిని వారి సొంత శాఖలకు పంపించారు. దీంతో కొండా సురేఖకు సంబంధించిన పేషీ వ్యవస్థ పూర్తిగా ఖాళీ అయింది.
ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. అనంతరం ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ అధికారులు ఆమెకు కేటాయించిన కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించిన కొద్ది రోజులకే ఛాంబర్, పేషీలను సైతం ఖాళీ చేయించడం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

