KTR about Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆడుతున్న డ్రామా అని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ విచారించిన అనంతరం.. నందినగర్‌లోని నివాసం నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/sit-interrogation-kcr-in-phone-tapping-case-concludes/
చౌకబారు రాజకీయాలకు భయపడరు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో ఈ రోజు సిట్ అధికారులు విచారించిన అనంతరం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌కి బయలుదేరారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ఇలాంటి చౌకబారు రాజకీయాలకు భయపడరని కేటీఆర్ హెచ్చరించారు. ఆయన ఎన్నడూ ఢిల్లీ ఒత్తిళ్లకు లొంగలేదని వ్యాఖ్యానించారు.
ప్రజలు గమనిస్తున్నారు..
‘ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ విచారణ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విధమైన డ్రామాలు ఆడుతోంది. చట్టాన్ని సిట్ గమనించడం లేదు. 65 ఏళ్లు పైబడిన వారిని నివాసంలోనే విచారించాలనే నిబంధనలు ఉన్నాయి. అయినా పోలీసులు కావాలని నోటీసుల విషయంలో హడావుడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడించినట్లుగా సిట్ ఆడుతోంది. అధికార పార్టీ నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలపై ఎందుకు సిట్ వేయడం లేదు.? ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న వేధింపులను ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే ప్రజల కోర్టులో తగిన బుద్ధి చెబుతారు.’ అని కేటీఆర్ మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/sports-news/pakistan-boycotted-the-t20-wc-match-against-india/
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి గుండు సున్నా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మూడు ముక్కల్లో చెప్పాలంటే డైవర్షన్, సబ్ వెర్షన్, పర్ వర్షన్ అన్నట్లుగా కాంగ్రెస్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ అసమర్థత వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. బడ్జెట్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఒక్కరూ స్పందించలేదని.. ఈ సారి రాష్ట్రానికి గుండు సున్నా అని తెలుసు కాబట్టే సిట్ విచారణను తెర మీదకు తెచ్చారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్‌కి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కదిలివచ్చి, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, రాజధాని వరకు ఎక్కడికక్కడ ఉద్ధృత స్థాయిలో నిరసనలు తెలిపిన ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి, కార్యకర్తకు, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

