HomeTop StoriesKTR: అడ్డ దారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్.. ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

KTR: అడ్డ దారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్.. ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

KTR Fires on Congress Failures: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణకి నేటితో పుష్కర కాలం పూర్తయిందని కేటీఆర్ గుర్తుచేశారు. దశాబ్ద కాలం పాటు ఎంతో వైభవంగా వర్ధిల్లిన తెలంగాణ రాష్ట్రం దురదృష్టవశాత్తూ నేడు ముష్కరుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర గల ఈ పవిత్ర నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని ఎప్పుడో వదిలించుకున్నారని, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అమాయకంగా నమ్మి ఆ పార్టీని గెలిపించారన్నారు. అడ్డదారిలో గద్దెనెక్కిన ఈ అడ్డగాడిద కాంగ్రెస్‌ను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Also Read: Mamata Banerjee: అరెస్ట్ చేసుకోండి.. వెనక్కి తగ్గేదే లే..! ధర్నా చేసి తీరుతానంటూ దీదీ శపథం..!

రైతు బంధు పోయి రాహుల్‌ బంధు వచ్చింది..

ఇక, కాంగ్రెస్‌ పాలనపై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ఎప్పుడో మంగళం పాడిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో నిరంతరాయంగా సాగిన రైతు బంధు పథకాన్ని సీఎం రేవంత్ నాలుగు సార్లు ఎగ్గొట్టారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతు బంధు బంద్ అయిందని, దానికి బదులుగా రాహుల్ బంధు స్టార్ట్ అయిందన్నారు. తెలంగాణ సొమ్ము అప్పనంగా ఢిల్లీకి తరలిపోతోందని ఫైరయ్యారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి, ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.

Also Read: Monsoon : రుతుపవన రాక.. జూన్ 4న కేరళలోకి నైరుతి ప్రవేశం – నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం

తెలంగాణ తల్లి కిరీటాన్ని ఎత్తుకెళ్తుంటే చూస్తూ ఊరుకోం..

మరోవైపు, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ విమర్శించారు. సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ గానీ, మంత్రులు గానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వనరులైన కృష్ణా, గోదావరి నదీ జలాలను రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. నెత్తురు పారిన ఇదే నేలపై సాగునీరు పారించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి గొప్ప నాయకున్ని కొందరు ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని, తెలంగాణ తల్లి నెత్తిన ఉన్న కిరీటాన్ని ఎత్తుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు మరో ప్రజా పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ భవన్‌లోని నేతలు, కార్యకర్తలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News