KTR GHMC election sketch: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్ పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ నెలలోనే నిర్వహించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు, నాయకులు ఇప్పటి నుంచే ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన గ్రేటర్ ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి కంచు కోట అని గుర్తు చేసిన కేటీఆర్.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి తీరాలన్నారు. “డిసెంబర్ లేదా జనవరిలో గ్రేటర్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మరో ఏడాది కాలంలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు మనకు అత్యంత కీలకం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వందకు వంద శాతం తెలంగాణలో మనదే అధికారం, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావడం ఖాయం.” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Also read: Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 24 మంది జవాన్లు మృతి
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు..
మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించినవి అయినప్పటికీ ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం వహించకూడదని నాయకులను కేటీఆర్ హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని, గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో సాధించిన స్థానాల కంటే ఈసారీ అంతకు మించి అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని క్యాడర్‌కి దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే కార్యకర్తలకు, నాయకులకు ఈ ఎన్నికల్లో పూర్తి ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీని నమ్ముకుని, ప్రజల్లో ఉంటూ కష్టపడే వారిని బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గుర్తిస్తుందన్నారు. వారికి తగిన సమయం వచ్చినప్పుడు పదవులు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామన్నారు.

