KTR letter to Union Minister Kishan Reddy: రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణిలో జరిగిన రూ.16 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. సింగరేణి నిల్వల నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.16 వేల కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని, స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అప్పనంగా అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. నైని కుంభకోణం మొదలుకొని, వందల అక్రమాలు జరిగినా ఇంతవరకూ కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బొగ్గు నిల్వల్ని తనిఖీ చేసే సంబంధిత శాఖ గానీ.. కాగ్ అధికారులు కానీ ఇప్పటి ఇటు వైపు ఎందుకు చూడటం లేదని, ఎందుకు తనిఖీలు చేయలేదని నిలదీశారు. సింగరేణి బొగ్గు అంటే తెలంగాణ ప్రజల ఆస్తి అని, అలాంటి ఆస్తిని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని, సింగరేణి పరిరక్షణకు మరో పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపారు.
Also Read: CM Revanth: బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదు.. ఆయనో చెల్లని నోటు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బొగ్గును అప్పనంగా దోచుకుపోతున్నారు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని మనుగడనే దెబ్బతీస్తున్నాయని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరికీ లోపాయికార ఒప్పందం లేకుంటే ఎందుకు విచారణ జరిపి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్వయంగా కిషన్ రెడ్డే బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉండగా.. రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన కుంభకోణం జరగడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7,20,00 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్‌లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం-1 లో ఆరు లక్షలు, రామగుండం-2 లో నాలుగు లక్షలు, భూపాలపల్లిలో 5 లక్షల 40 వేలు, ఇల్లందులో 3 లక్షల 50 వేలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులు.. ఇలా సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని లెక్కలు చూపించినప్పటికీ, కోల్ స్టాక్ పాయింట్ల దగ్గర ఆ బొగ్గు లేకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద ఆధారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం, రాష్ట్రం కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ స్కాంను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి.. ఆయా గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
Also Read: Hydra operation: పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ. 30 వేల కోట్ల విలువైన 200 ఎకరాలకు ఫెన్సింగ్
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..
అసలు బొగ్గు ఉత్పత్తి కోసం కోల్ ఇండియా పాటించే విధానాలేంటి? కాంగ్రెస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్‌ను ఎవరి ప్రయోజనాల కోసం పెట్టారు? చివరికి సీఎస్‌ఆర్ నిధులను ఎలా పక్కదారి పట్టించారు? అనే అంశాలపై వాస్తవాలను బయటపెట్టకపోవడం కాంగ్రెస్ సీఎంతో మీకున్న లోపాయికారి ఒప్పందాలను బహిర్గతం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. అన్ని టన్నుల బొగ్గు ఏమయిందో వెంటనే విచారణ జరిపించి నిజానిజాలేంటో నిగ్గు తేల్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. సింగరేణి సంస్థను కోలుకోని విధంగా దెబ్బతీసే ఈ భారీ కుంభకోణంపై ఒకవేళ విచారణ జరపకపోతే కార్మిక లోకంతో కలిసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తుందని హెచ్చరించారు.

