హైదరాబాద్(తెలుగుప్రభ): తెలంగాణలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పడం కాదని, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే బహిరంగంగా వెల్లడిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో పాలన ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ విమర్శలుగా కొట్టిపారేస్తూ వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు అదే ఆరోపణలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నోటి నుంచి వస్తున్నాయని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయడం సాధారణ విషయం కాదని, ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు దేశ ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని చెబుతున్నారని, మరోవైపు రాష్ట్రంలో అవినీతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నలు లేవనెత్తుతున్నారని కేటీఆర్ అన్నారు.
రాజకీయ వేదికలపై ఆరోపణలతో ప్రయోజనమేంటి?
తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారన్న ఆరోపణలు ప్రధానమంత్రి స్థాయి నుంచి వస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలో లేదా రాజకీయ వేదికలపై అవినీతి ఆరోపణలు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని, ఆరోపణల్లో వాస్తవం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఈడీ దాడులు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో, విచారణ ఎక్కడికి చేరిందో ప్రజలకు స్పష్టత లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎవరి విషయంలోనైనా ఆరోపణలు వచ్చినప్పుడు రాజకీయ అనుబంధాలను పక్కనపెట్టి చట్ట ప్రకారం విచారణ జరగాలని, దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం కలిగేలా వాటి పనితీరు ఉండాలని కేటీఆర్ అన్నారు.

