KTR Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేశాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా అక్రమాలకు, అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని.. నేరుగా దాదాపు 15- 16 మున్సిపాలిటీల్లో గెలిచామని చెప్పారు. మరో 15- 16 చోట్ల అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచామని వెల్లడించారు. మొత్తంగా 750 వార్డుల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేశారని ప్రశంసించారు.
పలు మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ మరింత అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని కేటీఆర్ ఆరోపించారు. మున్సిపల్ పీఠాల కైవసానికి అధికార పార్టీ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలుపెట్టిందని వ్యాఖ్యానించారు. పుర ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో తేల్చారన్నారు. హైదరాబాద్ సహా ఇతర కార్పొరేషన్‌లలోనూ ఇదే ఉత్సాహంతో దూసుకుపోతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/congress-won-90-seats-in-municipality-elections/
హంగ్ మున్సిపాలిటీలు ఎవరికి దక్కుతాయో చూడాలి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొంటాం. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తా. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు- కేటీఆర్
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణిలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే సీపీఐ తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టేందుకు కార్పొరేషన్‌లో సీపీఐకి మద్దతిస్తామన్నారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని పోతామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని.. కానీ గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి అంత నమ్మకం ఉంటే.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రధాన ప్రతిపక్షంగా సఫలమయ్యామని వెల్లడించారు. అందుకే ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. కాంగ్రెస్‌పై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడవుతోందని ఎద్దేవా చేశారు. పనితీరు బాగా ఉంటే ప్రజలు ఆదరిస్తారని కేటీఆర్ హితవు పలికారు.

