kurchi thatha: టాలీవుడ్ ప్రేక్షకులకు, సోషల్ మీడియా నెటిజన్లకు సుపరిచితుడైన కుర్చీ తాత ఇక లేరు. ‘కుర్చీని మడతపెట్టి..’ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రి ఇంటర్నెట్‌ను షేక్ చేసిన మహ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత బుధవారం రాత్రి ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ సమీపంలో రాత్రి ఆయన వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి శ్వాస విడిచారు. సాధారణంగా ఆయన తన ఎక్కువ సమయాన్ని కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లోనే గడుపుతూ ఉండేవారు.
ఒకే ఒక్క డైలాగ్.. ఇంటర్నెట్ షేక్: గతంలో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన సరదాగా మాట్లాడిన మాటలు, అందులోని ‘కుర్చీని మడతపెట్టి’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ డైలాగ్‌ను రీమిక్స్ చేస్తూ వచ్చిన మీమ్స్, సాంగ్స్ ఇంటర్నెట్‌ను ఊపేశాయి. ఈ క్రేజ్‌ను గమనించిన దర్శకుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో ఆ డైలాగ్‌తో ఒక ప్రత్యేకమైన మాస్ సాంగ్‌ను రూపొందించారు. ఆ పాటలో కుర్చీ తాత మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
గతంలో పుకార్లు.. ఇప్పుడు నిజంగానే: గతంలో కూడా కుర్చీ తాత చనిపోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు షికారు చేశాయి. ఆ సమయంలో ఆయన ఆ వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయవద్దని నెటిజన్లను వేడుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆయన నిజంగానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఎంతో మందిని అలరించిన కుర్చీ తాత ఆత్మకు శాంతి చేకూరాలంటూ నెటిజన్లు, ఆయన అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.

