HomeతెలంగాణInvestments : పెట్టుబడులకు ల్యాండ్‌ బ్యాంక్‌ బూస్ట్..పారిశ్రామిక భూములపై టీజీఐఐసీ ఫోకస్

Investments : పెట్టుబడులకు ల్యాండ్‌ బ్యాంక్‌ బూస్ట్..పారిశ్రామిక భూములపై టీజీఐఐసీ ఫోకస్

  • 27,507 ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు.. ఇప్పటికే 8,089 ఎకరాలు స్వాధీనం
  • 22 జిల్లాల్లో భూముల సమీకరణ.. పరిశ్రమలకు భారీ ల్యాండ్‌ బ్యాంక్‌
  • 1,143 యూనిట్లకు 2,441 ఎకరాలు.. రూ.94,573 కోట్ల పెట్టుబడుల అంచనా
  • పాత పరిశ్రమల తరలింపునకు మరో 6,439 ఎకరాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (తెలుగుప్రభ): పారిశ్రామిక పెట్టుబడులకు భూముల కొరత లేకుండా ప్రభుత్వం భూసేకరణను పరుగులు పెట్టిస్తోంది. కొత్త పరిశ్రమలకు విస్తారంగా భూములు కేటాయించడంతో పాటు.. భారీ ప్రాజెక్టుల కోసం వేలాది ఎకరాలు సమీకరించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వేగం పెంచింది. కొత్త పరిశ్రమలకు భూములు సమకూర్చే లక్ష్యంతో 27,507 ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఇప్పటికే 8,089 ఎకరాలు స్వాధీనంలోకి తీసుకొచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22 జిల్లాల్లో ఈ భూసేకరణ ప్రక్రియ సాగింది. 1,143 యూనిట్లకు కేటాయించిన 2,441 ఎకరాల ద్వారా రూ.94,573 కోట్ల పెట్టుబడులు, 85,416 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, డేటా సెంటర్లు, భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్‌లోని పాత పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చే హిల్ట్ పాలసీతో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదించిన 27,507.26 ఎకరాల్లో 14,851.34 ఎకరాలు అసైన్డ్, 5,726.11 ఎకరాలు పట్టా, 6,929.21 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉన్నాయి. ఇప్పటివరకు 3,230.19 ఎకరాల అసైన్డ్, 2,785 ఎకరాల పట్టా, 2,073.26 ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి 8,089.05 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

భూసేకరణలో సంగారెడ్డి టాప్
జిల్లాల వారీగా సంగారెడ్డిలో అత్యధికంగా 2,708.07 ఎకరాలు, వికారాబాద్‌లో 1,819.21, రంగారెడ్డిలో 1,771.34 ఎకరాలు స్వాధీనమయ్యాయి. ఇప్పటికే భూముల కేటాయింపుల ద్వారా భారీ పెట్టుబడులకు మార్గం సులువైంది. 2023 డిసెంబర్–2026 జూన్ మధ్య 1,143 యూనిట్లకు 2,441 ఎకరాలు కేటాయించారు. వీటి ద్వారా రూ.94,573 కోట్ల పెట్టుబడులు, 85,416 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎకరాకు సగటున రూ.38.74 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

మెగా ప్రాజెక్టులకు భూములే పునాది
అమెజాన్ డేటా సర్వీసెస్ సహా పలు మెగా ప్రాజెక్టులకు వందల ఎకరాల భూములు కేటాయించారు. మీర్‌ఖాన్‌పేట్‌లో అమెజాన్‌కు 202 ఎకరాలు, పెద్దవీడులో 97 ఎకరాలు కేటాయించగా.. ఈ రెండు ప్రాజెక్టుల పెట్టుబడి అంచనాలే రూ.59 వేల కోట్లకు పైగా ఉన్నాయి. కంట్రోల్ ఎస్, హిందూస్థాన్ యూనీలీవర్, లెన్స్ కార్ట్, ప్రీమియర్ ఎనర్జీస్, జేఎస్ డబ్ల్యూ తదితర సంస్థలకు భూములు కేటాయించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లోని జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ భూసేకరణలో దాదాపు తుది దశకు చేరింది. ఫేజ్–1కు అవసరమైన 3,245.48 ఎకరాల్లో 3,170.48 ఎకరాలు సేకరించారు. అంటే 97.7 శాతం పూర్తయింది. రూ.2,360.54 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో చేపడుతున్న ఈ స్మార్ట్ సిటీలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

పాత పరిశ్రమలకు కొత్త చిరునామాలు
హైదరాబాద్‌లోని బాలానగర్, కాటేదాన్, కూకట్‌పల్లి వంటి పాత పారిశ్రామిక ప్రాంతాలు నగర విస్తరణతో జనావాసాల మధ్యకు వచ్చాయి. వీటిని పునర్వ్యవస్థీకరించేందుకు హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చే ప్రక్రియ చేపట్టారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరానికి వెలుపలికి తరలించేందుకు 19 ప్రాంతాల్లో 6,439.47 ఎకరాలను గుర్తించారు. ఇందులో 4,488 ఎకరాలు కేటాయించదగినవిగా ఉన్నాయి. హిల్ట్ పాలసీ కింద జూన్ 30 నాటికి 193 దరఖాస్తులు వచ్చాయి. డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు కింద ఇప్పటివరకు రూ.150 కోట్లు వసూలయ్యాయి. అన్ని చెల్లింపులు పూర్తయితే రూ.1,500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ నిధుల్లో కొంత భాగాన్ని రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, దివిటిపల్లి–తాడిపర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు అవసరమైన భూములను సమకూర్చడమే టీజీఐఐసీ ప్రధాన లక్ష్యంగా మారింది. ముందుగా భూములు.. ఆపై మౌలిక వసతులు.. తర్వాత పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు అనే వ్యూహంతో భూసేకరణను వేగవంతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News