HomeతెలంగాణLand Dispute Protest: భూమి వివాదం.. పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధితుల బైఠాయింపు

Land Dispute Protest: భూమి వివాదం.. పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధితుల బైఠాయింపు

  • భూమి వివాదం ముదిరింది.. పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయింపు
  • న్యాయం కోసం బాధితుల ఆందోళన.. అడ్డంకిపై పోలీసుల కేసు

శాయంపేట, అక్టోబర్ 6 (తెలుగు ప్రభ): శాయంపేట మండలంలోని గోవిందాపురం గ్రామంలో భూమి హక్కులకు సంబంధించిన వివాదం ముదిరి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దారితీసింది. తమ వారసత్వ భూమిపై హక్కులు కాపాడి, భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ అడప దేవేంద్ర, రోడ్ల రామచందర్‌తో పాటు పలువురు సోమవారం శాయంపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. తమ భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో మధ్యవర్తుల జోక్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆరోపించారు.

- Advertisement -

బాధితుల వాదన ప్రకారం.. సర్వే నంబర్లు 678/1, 678/ఏలో ఉన్న నాలుగెకరాల భూమిని కుటుంబ అవసరాల కోసం విక్రయించేందుకు ప్రయత్నించగా వివాదం తలెత్తింది. కొనుగోలుదారుల నుంచి రావాల్సిన డబ్బులు పూర్తిగా అందలేదని తెలిపారు. భూమి విషయంలో ఆరె మొగిలి, చింత నిప్పుల భద్రయ్య, బొత్త కుమార్ స్వామి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. తమ భూమిలోకి ప్రవేశించి ట్రాక్టర్లతో దున్నుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. సర్వే నంబర్లలో తేడాలు ఉన్నాయంటూ తమను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ భూ వివాదంలో తమకు అన్యాయం జరిగేందుకు మండలంలోని అధికార పార్టీ నాయకుడి అండ కూడా ఉందని ఆరోపించారు.

ధర్నాతో మరో వివాదం.. నలుగురిపై కేసు

మరోవైపు బాధితులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై జక్కుల పరమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు రోడ్ల రామచందర్, రోడ్ల సరోజన, రోడ్ల శ్యామల, అడప దేవేంద్రలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భూ హక్కులు, విక్రయ ఒప్పందం, సర్వే నంబర్లలోని వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే వివాదం పోలీస్‌స్టేషన్‌ వరకు చేరడం, అనంతరం నిరసనకారులపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News