Latest weather: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ వర్ష సూచనతో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో ఎల్లో అలెర్ట్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు పడే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ‘ఎల్లో అలెర్ట్’ జారీ చేశారు.
ఏపీలో పిడుగుల హెచ్చరిక: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది. నేడు, రేపు అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, యానాం పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. వర్షాలు కురిసినప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. ఉక్కపోత మరింతగా కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు పిడుగుల సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు.

